లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..

85% కేసులు మర్కజ్ వల్లే

మిగతావి ఫారిన్ వెళ్లొచ్చినోళ్లు, వాళ్ల కాంటాక్టులు

లాక్డౌన్ పెంచడానికి కారణం మర్కజ్ లింకులేనన్న కేసీఆర్

రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదైంది. 19వ తేదీ నాటికి ఢిల్లీ మీదుగా ఇండోనేషియన్లు కరీంనగర్ కు వచ్చిన విషయం, వారిలో ఎనిమిది మందికి కరోనా వచ్చిన విషయం బయటపడింది. వీరంతా ఢిల్లీ మర్కజ్ కు హాజరై వచ్చినోళ్లే అయినా మార్చి నెలాఖరు వరకు ఆ లింకు తెలియలేదు. ఆ రోజుకు రాష్ట్రంలో నమోదైన కేసులు 76 మాత్రమే. కాని అప్పటికే ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మర్కజ్ కేసుల కలకలం మొదలైంది. ఒకటి రెండు రోజుల్లోనే రాష్టంలోనూ ఎఫెక్ట్ బయటపడింది. రోజూ పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతూ వచ్చాయి. మర్కజ్ కు ఎవరెవరు వెళ్లొచ్చారో గుర్తించడం, ట్రేస్ చేసి పట్టుకోవడం, హాస్పిటళ్లకు తరలించి టెస్టులు చేసే సరికి వైరస్ విస్తరించింది. అనుమానితులను హాస్పిటళ్లకు తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు హెల్త్ సిబ్బందికి దొరక్కుండా తప్పించుకున్నారు. దీంతో కొందరి నుంచి ఫ్యామిలీలు, సన్నిహితులకు వైరస్ సోకింది. మొత్తంగా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్టంలోని మొత్తం కరోనా కేసుల్లో 85 శాతం కేవలం మర్కజ్ వెళ్లొచ్చిన వారినుంచే సోకాయి. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇది రాష్టంలో లాక్డౌన్ ను మరికొంత కాలం పొడిగించడానికి, కఠినంగా అమలు చేయడానికి కారణమైంది.

పట్టుకోవడమే సవాల్
మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించడం, పట్టుకోవడం పెద్ద సవాలుగా మారిందని పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నా రు. “మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లకు నచ్చచెప్పి క్వారంటైన్ కు తరలించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. మర్కజ్ నుంచి వచ్చినోళ్లు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవర్ని కలిశారన్నది గుర్తించడంలో ఆలస్యమైంది..” అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. మర్కజ్ యాత్రికుల కాంటాక్ట్స్ ను గుర్తించి, టెస్టులు చేసే సరికి నష్టం పెరిగిపోయిందని పేర్కొన్నారు. అప్పటికే మరింత మందికి వైరస్ వ్యాపించిందని.. దీనివల్ల రానున్న రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కంటెయిన్మెంట్ ఏరియాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని స్పష్టం చేశారు.

నిజాముద్దీన్ లింక్ లెక్కలివీ..
రాష్ట్రం నుంచి మర్కజ్ వెళ్లొచ్చిన వారి సంఖ్య అధికారికంగా 1089గా గుర్తించారు. అందులో 232 మందికి వైరస్ సోకింది. అంటే సుమారు 25 శాతం మందికి కరోనా వచ్చింది. మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి 497 మందికి వైరస్ వచ్చింది. ఇందులో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు.
హైదరాబాద్లోని తలాబ్ కట్టలో ఒకే ఫ్యామిలీలో 20 మందికి కరోనా వచ్చింది. ఏడు కుటుంబాల్లో కలిపి ఏకంగా 101 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఆదివారం నాటికి 21 మంది చనిపోగా.. అందులో 18 మంది నేరుగా మర్కజ్ లింక్ ఉన్నవాళ్లే. మన రాష్ట్రంతోపాటు తమిళనాడులో 87 శాతం, ఏపీలో 90 శాతానికిపైగా మర్కజ్ లింకు కేసులే. యూపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

 

మర్కజ్ నిజాముద్దీన్ లింకు కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 85 శాతం వరకు మర్కజ్ లింక్ ఉన్నవాళ్లే కావడం కలవరం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం వరకు కరోనాతో చనిపోయిన 21 మందిలో 18 మంది మర్కజ్ వెళ్లొచ్చినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులేనని హెల్త్డ్ డిపార్టమెంట్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఇంతగా విస్తరించడానికి మర్కజ్ లింకులే ప్రధాన కారణమని అంటున్నారు. మర్కజ్ లింక్ లేకుంటే రాష్ట్రంలో కేసుల సంఖ్య బాగా తక్కువగా ఉండేదని.. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉండేది కాదని స్వయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే కొన్నిమార్లు ప్రకటించారు. నిజాముద్దీన్‌ ‌ద్వారా వచ్చిన ప్రాబ్లమే కంటిన్యూ అవుతోందని, వాళ్ల ఫ్యామిలీ కాంటాక్ట్స్, ఇతర కాంటాక్ట్స్‌‌ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలో లాక్డౌన్ కూడా
పొడిగించారు.

కంట్రోల్లోకి వచ్చినట్టే వచ్చి..
రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వైరస్ సోకింది. తర్వాత డైరెక్ట్ గా విదేశాల నుంచి వచ్చిన మరో 34 మందికి, వారి నుంచి 30 మంది కాంటాక్ట్స్ కు పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి మార్చి 22లోపు దాదాపు 26 వేల మంది రాష్ట్రానికి రాగా.. ఏప్రిల్ తొలివారం నాటికే చాలా మంది క్వారంటైన్ గడువు కూడా ముగిసిపోయింది. దాంతో కరోనా దాదాపు కంట్రోల్లోకి రావడంతో సర్కారు ఊపిరి పీల్చుకుంది. కానీ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వ్యవహారంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగింది. వాస్తవానికి మర్కజ్ మూలాలున్న తొలికేసు మార్చి 17నే నమోదైంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన తబ్లిగి జమాత్ ప్రచారకులు పది మందికి పాజిటివ్ గా గుర్తించారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారని పోలీసులు కూపీ లాగటంతో ఢిల్లీ మర్కజ్ లింక్ బయటపడింది. తర్వాత అధికారులు మర్కజ్ లింకులను ఛేదించే పనిలో పడ్డారు.

మెజారిటీ కేసుల్లో మర్కజ్ మూలాలే..
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మర్కజ్ వెళ్లిన వారు, వారి కాంటాక్స్ లింకులే. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 858 పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 729 కేసులకు మర్కజ్ తో సంబంధం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇందులో మర్కజ్ వెళ్లొచ్చి న వారిలో 232 మందికి కరోనా సోకగా.. వారి నుంచి 497 మందికి వ్యాపించిందని గుర్తించారు. వారుగాకుండా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 34 మందికి, వారి నుంచి 30 మంది కాంటాక్ట్స్ కు వైరస్ పాజిటివ్ ఉందని తేలింది. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, సెకండరీ కాంటాక్ట్స్ 65 మందికి కూడా వైరస్ సోకింది. ఇందులో కొందరికి వైరస్ ఎలా వచ్చిందో ఇంకా గుర్తించలేదు. ఇక చనిపోయిన తర్వాత టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చిన కేసులు కూడా ఉన్నాయి.

తొలి మృతి మర్కజ్ యాత్రికుడిదే..
రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన తొలివ్యక్తి మర్కజ్ కు వెళ్లిన వృద్ధుడేనని అధికారులు చెప్తున్నారు. మార్చి 27న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్ బస్తీకి చెందిన 74 ఏండ్ల వృద్ధుడు గ్లోబల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. తొలుత జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. తర్వాత న్యూమోనియా ఎటాక్ అయి చనిపోయారు. తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆయన మర్కజ్ ప్రారనల్థకు వెళ్లొచ్చారన్న విషయం తెలియడంతో.. శాంపిల్స్ సేకరించి, టెస్టు చేయగా కరోనా పాజిటివ్ తేలింది. ఆ తర్వాత నమోదైన మరణాల్లో చాలా వరకు మర్కజ్ మూలాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. మార్చి 28న హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో ఒకే ఫ్యామిలీలో నలుగురికి కరోనా వచ్చింది. అందరికి ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీయగా.. ఫ్యామిలీలో ఒకరు మర్కజ్ కు వెళ్లొచ్చారని తేలింది.