గొప్పలకు పోతే అప్పుల బతుకే: ఈఎంఐల ఊబిలో 85% మంది.. సగం జీతం కిస్తీలకే..!

గొప్పలకు పోతే అప్పుల బతుకే: ఈఎంఐల ఊబిలో 85% మంది.. సగం జీతం కిస్తీలకే..!

డబ్బు లేకపోయినా గొప్పగా కనిపించాలనే ఆరాటం వల్ల చాలా మంది మధ్యతరగతి వాళ్లు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఏదైనా వస్తువుకు ఈఎంఐ ఇస్తున్నారంటే అది మనం కొనలేం కాబట్టే పెట్టారని అర్థం చేసుకోవాలి. కార్లు, బైకులు, ఖరీదైన స్మార్ట్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌ ఎప్పటికీ ఆస్తులు కాలేవు. జేబులో బాగా డబ్బు ఉంటే కొనాలి కానీ, అప్పుతో కాదు. మిగులు డబ్బు ఉంటే మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్, ఇల్లు, రిటైర్మెంట్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌, గోల్డ్‌‌‌‌ వంటి వాటిపై ఇన్వెస్ట్​ చేయడం బెటర్​.

న్యూఢిల్లీ: భారీగా జీతం వచ్చే వాళ్లలోనూ చాలా మంది అప్పుల ఊబిలో కూరుకున్నారని తేలింది. ఈ రెజల్యూషన్ కన్సల్టెన్సీ గత జూన్–డిసెంబర్ మధ్య 10 వేల మంది బారోవర్ల (అప్పులు తీసుకున్న వాళ్లు)పై స్టడీ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 85 శాతం మంది తమ నెలవారీ ఆదాయంలో 40 శాతానికిపైగా మొత్తాన్ని ఈఎంఐలకే చెల్లిస్తున్నారు. 

నెలకు రూ.35 వేల నుంచి రూ.65 వేల సంపాదించే వాళ్లు రూ.28 వేల నుంచి రూ.52 వేల అప్పుల కోసమే ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువులు, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలకు డబ్బులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. సుమారు 40 శాతం మంది ఒక క్రెడిట్ కార్డు అప్పు తీర్చడానికి మరో కార్డు నుంచి డబ్బు తీసుకుంటూ వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారు. 

మరో 22 శాతం మంది స్నేహితులు, బంధువుల సాయం కోరుతుండగా, 65 శాతం మంది దగ్గర అత్యవసర ఖర్చులకూ డబ్బు మిగలడం లేదు. పిల్లల చదువులను ఆపేయడం, వైద్య చికిత్సలను వాయిదా వేయడం, ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు చేసుకోవడం, ఆహార బడ్జెట్ తగ్గించుకోవడం వంటివి చేస్తున్నారు. సుమారు 15 శాతం మంది బంగారం, ఆస్తులను అమ్మి అప్పులు కడుతున్నారు. ఇవన్నీ కేవలం 2 నుంచి 6 నెలలు మాత్రమే తాత్కాలిక ఊరటనిస్తున్నాయి. ఆ తర్వాత అప్పుల భారం మరింత పెరుగుతోంది.

వేధింపులతో సతమతం

రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల 72 శాతం మంది బాధితులు నలిగిపోతున్నారు. వీరిలో 67 శాతం మందికి ప్రతి నెల 50 నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తెల్లవారి నుంచే ఫోన్లు చేస్తూ ఏజెంట్లు వేధిస్తున్నారు. వాట్సాప్, ఎస్​ఎంఎస్‌ల ద్వారా 70 శాతం మందికి బెదిరింపులు వస్తున్నాయి. ఏజెంట్లు ఇళ్లకు, ఆఫీసులకు వచ్చి రచ్చ చేయడం వల్ల పరువు పోయిందని 12 శాతం మంది చెప్పారు. చివరికి ఉద్యోగాలకు కూడా ముప్పుగా మారింది.

18 శాతం కేసుల్లో కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం బెదిరిస్తున్నట్లు తేలింది. ఈ పరిస్థితుల కారణంగా 50 శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబ కలహాలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన కేసుల్లో ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తున్నాయి. 

ఆర్​బీఐ రూల్స్, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, బ్యాంకింగ్ అంబుడ్స్‌‌‌‌మన్ వ్యవస్థలపై అవగాహన లేకపోవడం వల్ల బారోవర్లు ఏజెంట్ల దోపిడీకి గురవుతున్నారు.  బాధితులు తమ హక్కులను తెలుసుకుని వేధింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని, బ్యాంకింగ్ అంబుడ్స్‌‌‌‌మన్‌‌‌‌కు ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా బ్యాంకు అధికారులను కలిసి కొంత గడువు కోరాలని ఈ–రెజల్యూషన్ సూచించింది.