4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్​ టెలీ కాన్ఫరెన్స్

4 జిల్లాల కలెక్టర్లతో సీఎస్​ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు 857 గ్రామాల్లోకి వరద చేరింది. నదులు, ప్రాజెక్టులతో పాటు కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడి వరద ముంచెత్తింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. ఈ జిల్లాల నుంచే కంట్రోల్​రూమ్ కు వందల సంఖ్యలో కాల్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిపై గురువారం అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ రివ్యూ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి భారీ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వాళ్లు 223 షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. భద్రాచలంలోని 43 షెల్టర్లలో 6,318 మంది, ములుగు జిల్లాలోని 33 షెల్టర్లలో 4,049 మంది, భూపాలపల్లి జిల్లాలోని 20 షెల్టర్లలో 1,226 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ​టీమ్స్ 16 మందిని, ఎయిర్ ఫోర్స్ ఇద్దరిని రక్షించాయని చెప్పారు. 

మరో రెండ్రోజులు వానలు పడ్తాయి : వాతావరణ శాఖ

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్​ టెలీ కాన్పరెన్స్​నిర్వహించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. మరో రెండ్రోజులు వానలు పడ్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో గోదావరిలో భద్రాచలం వద్ద నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని సీఎస్ చెప్పారు. జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని రెడీ చేసుకోవాలని ఆదేశించారు. అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.