- అత్యధిక కాలం హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్‌గా ఉన్న నేతగా గుర్తింపు
- సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్
- డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఎదురులేని నేతగా మోదీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సృష్టించారు. భారత రాజకీయాల్లో అత్యధిక కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇంతకుముందు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు పదవిలో ఉండగా, మోదీ ఆ రికార్డును బ్రేక్ చేశారు. గుజరాత్ సీఎంగా, ప్రధాన మంత్రిగా మొత్తం 8,931 రోజులు పదవిలో ఉన్న మోదీ.. తన 25 వ ఏట ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాన మంత్రి కూడా మోదీయే.. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి, ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా మోదీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరుసగా 2007, 2012లలో సీఎంగా పనిచేశారు. అత్యధిక కాలం గుజరాత్‌కు సీఎంగా పనిచేసిన రికార్డు ఆయన పేరుపైనే ఉంది. ఆ తర్వాత 2014లో మొదటిసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రస్తుతం కొనసాగుతున్నారు. రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించి, వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి కాంగ్రెసేతర నేతగా మోదీ నిలిచారు. మరోవైపు, రాజకీయాలతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా ఈ ఏడాది ప్రధాని మోదీ రికార్డులు సృష్టించారు. ఈ నెల ప్రారంభంలో యూట్యూబ్ చానల్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 30 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీనే టాప్‌లో ఉన్నారు.
కేంద్ర మంత్రులతో మోదీ ఉన్నత స్థాయి సమావేశం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పలువురు కేంద్ర మంత్రుల తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్‌నాథ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి తదితరులు పాల్గొన్నా రు. దేశంలో ముఖ్యంగా చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించారు. వినియోగదారుల, పారిశ్రామిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రపంచ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఇంధన భద్రతను కాపాడటానికి, తగినంత లభ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోందని కేబినెట్ తెలిపింది. విద్యాసంస్థలు, ఆస్పత్రుల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
