న్యూయార్క్‌‌‌‌లో ఘోర అగ్ని ప్రమాదం

న్యూయార్క్‌‌‌‌లో ఘోర అగ్ని ప్రమాదం
  •     అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఘటన
  •     బెడ్రూంలోని ఎలక్ర్టిక్‌‌‌‌ స్పేస్ హీటర్‌‌‌‌ నుంచి మంటలు..
  •     అక్కడి నుంచి మొత్తం అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు
  •     చావు బతుకుల మధ్య మరో 
  •     32 మంది బాధితులు


న్యూయార్క్‌‌‌‌: అమెరికాలోని న్యూయార్క్‌‌‌‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫ్లాట్ బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌లో చెలరేగిన మంటలు.. మెల్లగా 19 అంతస్తుల బిల్డింగ్‌‌‌‌ మొత్తానికీ వ్యాపించాయి. దీంతో 19 మంది ఆహుతి అయ్యారు. ఇందులో 9 మంది పిల్లలే. మరో 32 మంది పరిస్థితి సీరియస్​గా ఉంది.  ఎలక్ర్టిక్‌‌‌‌ స్పేస్ హీటర్‌‌‌‌‌‌‌‌లో సమస్యలు తలెత్తడంతో ప్రమాదం జరిగినట్లు ఫైర్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్లు చెప్పారు. దాదాపు 200 మంది ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు.
ప్రతి ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో బాధితులు..
ఆదివారం ఉదయం 11 గంటల సమయం (అక్కడి టైం ప్రకారం)లో న్యూయార్క్‌‌‌‌లోని బ్రోంక్స్‌‌‌‌లో 19 అంతస్తుల బిల్డింగ్‌‌‌‌లో మంటలు చెలరేగాయి. డూప్లెక్స్ అపార్ట్‌‌‌‌మెంటులో మంటలు అంటుకున్నాయని ఫోన్ వచ్చిందని, కేవలం 3 నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నామని ఫైర్ డిపార్ట్‌‌‌‌మెంట్ కమిషనర్ డేనియల్ నిగ్రో చెప్పారు. ‘‘ఎలక్ట్రిక్ స్పేస్ హీటర్‌‌‌‌‌‌‌‌లో సమస్య వల్లే మంటలు అంటుకున్నట్లు గుర్తించినం. ఆ హీటర్‌‌‌‌‌‌‌‌ ఓ ఫ్లాట్ బెడ్రూమ్‌‌‌‌లో ఉంది. అక్కడ మొదలైన మంటలు మొదట రూమ్‌‌‌‌కు, తర్వాత అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు వ్యాపించాయి. పారిపోవాలన్న తొందరలో ఎక్కడికక్కడ డోర్లు తెరిచిపెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో మొత్తం బిల్డింగ్‌‌‌‌ను పొగ కమ్మేసింది” అని చెప్పారు. చాలా మంది బయటికి వచ్చేందుకు ప్రయత్నించారని, కానీ దట్టమైన పొగలో ఎటు పోవాలో తెలియక ఇరుక్కుపోయారని చెప్పారు. ప్రతి ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో బాధితులు ఉన్నారని, పొగ పీల్చుకోవడం వల్ల స్పృహ తప్పి మెట్లపై పడిపోయారని.. కొందరికి కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించామన్నారు. మొత్తం 120 ఇండ్లున్న ఈ అపార్ట్‌‌‌‌మెంటు దాదాపు 50 ఏండ్ల కిందటిది. 

బాధితులకు కొత్త ఇండ్లు
‘‘32మంది చావుబతుకుల మధ్య ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌‌‌‌లో ఎక్కువగా ముస్లింలు ఉంటున్నారు. అందులో ఎక్కువ మంది ఆఫ్రికాలోని గాంబియా నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్లే” అని న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు నష్టపరిహారం నిధిని ఏర్పాటు చేస్తామని, వారికి కొత్త ఇండ్లు ఇస్తామని, అంత్యక్రియల ఖర్చులకు సాయం చేస్తామని న్యూయార్క్ గవర్నర్ కతి హొచుల్ చెప్పారు.