తమిళనాడులో 9.. పుదుచ్చేరిలో ఒకటి

తమిళనాడులో 9.. పుదుచ్చేరిలో ఒకటి
  •      కాంగ్రెస్​కు సీట్లు ఖరారు చేసిన డీఎంకే

చెన్నై : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులోని అధికార డీఎంకే, తన మిత్రపక్షాలైన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర పార్టీలకు సీట్లను ఖరారు చేసింది.  మొత్తం 40 లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాలకుగాను..21 స్థానాల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం) పోటీ చేయనున్నది. తమిళనాడులో 9 లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఏకైక సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. వీటిలో తిరువళ్లూరు, కృష్ణగిరి, కరూర్, కడలూరు, మైలదుతురై, శివగంగై, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి, పుదుచ్చేరి ఉన్నాయి. 

దిండిగల్‌‌‌‌‌‌‌‌, మదురై స్థానాల నుంచి సీపీఎం పోటీ చేయనున్నాయి. " తమిళనాడులో తొమ్మిది స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో డీఎంకే, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తాం. తమిళనాడులో అన్ని సీట్లు గెలుస్తాం" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. 

ఇతర పార్టీల కసరత్తు

బీజేపీతో సంబంధాలను తెంచుకున్న అన్నాడీఎంకే, పీఎంకే, దివంగత నటుడు విజయకాంత్‌‌‌‌‌‌‌‌ డీఎండీకే(దేశీయ ముర్పొక్కు ద్రవిడ మజగం)తో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నది. గతంలో ఎన్డీఏలో ఉన్న పుతియా తమిళగం కూడా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి మారింది. ఇక, రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ.. పీఎంకే, డీఎండీకేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. జీకే వాసన్‌‌‌‌‌‌‌‌కు చెందిన తమిళ మానిలా కాంగ్రెస్, కొన్ని చిన్న పార్టీలు ఇప్పటికే బీజేపీ కూటమిలో  చేరాయి.