90 శాతం రుణ యాప్ లు చైనా వాళ్లవే: సీపీ మహేశ్ భగవత్

90 శాతం రుణ యాప్ లు చైనా వాళ్లవే: సీపీ మహేశ్ భగవత్

ఇన్ స్టంట్ లోన్ యాప్ నిర్వాహకులను ఇద్దరిని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చైనాకు చెందిన హి జియాంగ్ తో పాటు… అకౌంటెంట్ గా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన వివేక్ కుమార్  ను అరెస్టు చేసినట్టు చెప్పారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ముంబై సెంటర్ గా యాప్ నిర్వహిస్తున్న హి జియాంగ్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన తర్వాత మీడియా ముందు హాజరుపరిచి మాట్లాడారు.

2019 లో బిజినెస్ వీసాపై ఇండియా వచ్చిన జియాంగ్…ముంబై కేంద్రంగా యాప్ లను నిర్వహించడం మొదలు పెట్టాడని తెలిపారు సీపీ మహేశ్ భగవత్. మొత్తం 24 యాప్ లు రూపొందించి..వాటి ద్వారా భారీగా రుణాలు ఇచ్చారని తెలిపారు. లోన్లు ఇచ్చిన తర్వాత వాటిపై 50 శాతం వడ్డీతో వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బాధ్యత కాల్ సెంటర్లకు అప్పగించడంతో…వారి వేధింపులతో లోన్లు తీసుకున్న వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి వేధింపులకు కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని తెలిపారు. ఇన్ స్టంట్ లోన్ యాప్ లు 90 శాతం చైనాకు చెందిన వాళ్లవే నని తెలిపారు సీపీ.

అరెస్టు చేసిన నిందితుల సంస్థలకు చెందిన దాదాపు రూ. 30 కోట్ల నగదు, 4 ల్యాప్ టాప్ లు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లోన్లు తీసుకున్నవారు సూసైడ్స్ చేసుకోవద్దని…ఎవరైనా వేధిస్తే డయల్ 100, రాచకొండ పోలీసులను సంప్రదించాలని సూచించారు సీపీ మహేశ్ భగవత్.