డీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన

డీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన

హైదరాబాద్,వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో పని చేస్తున్న 937 మంది టీచర్లను అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించడంతో వాళ్లు ఆందోళన బాట పట్టారు. తమను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ముందు నిరసన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున టీచర్ల తరలిరావడంతో పోలీసులను భారీగా మోహరించారు. కాగా, పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమించ చేయగా, టీచర్లు అక్కడి నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గత నవంబర్ లో కేజీబీవీల్లో పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీలను భర్తీ చేశారు. అయితే ఈ 23 నుంచి స్కూళ్లకు రావొద్దని ఎస్ఓలు చెప్పారన్నారు. కోవిడ్ టైంలో కూడా తాము విధులు నిర్వర్తించామని, కానీ ఎలాంటి ఆర్డర్లు లేకుండానే తమను తొలగించడం ఏంటని వారు ప్రశ్నించారు. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా జీతం ఇవ్వలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ జీతాలు విడుదల చేయాలని టీచర్లు డిమాండ్ చేశారు. కాగా, కమిషనర్ శ్రీదేవసేనతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.