టెన్త్ ఎగ్జామ్స్​కు 941 సెంటర్లు

టెన్త్ ఎగ్జామ్స్​కు 941 సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు వేగవంతం చేశారు. ఎగ్జామ్ సెంటర్లలో తాగునీరు, కరెంట్, శానిటేషన్, ఫ్యాన్లు, బెంచీలు సరిగా ఉన్నాయా లేదా అని చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈనెల 23 నుంచి జూన్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనుండగా.. గ్రేటర్ పరిధిలో మొత్తం 941 సెంటర్లు ఏర్పాటు చేశారు. 2 లక్షల 15 వేల మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో 406 సెంటర్లను ఏర్పాటు చేశామని.. 74 వేల 888 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయనున్నట్లు డీఈవో రోహిణి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 82 ప్రభుత్వ స్కూళ్లలో సెంటర్లు ఉండగా.. 60 స్కూళ్లలో సీసీ కెమెరాలు అమర్చామని డీఈవో చెప్పారు. మిగతా 22 ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతున్నాయన్నారు. దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలో సీసీ కెమెరాలున్నాయన్నారు.  ఎగ్జామ్ జరిగే ప్రతి రూమ్‌‌లో ఫ్యాన్లు, లైట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, మధ్యలో కరెంట్ పోకుండా విద్యుత్ శాఖ కు టైమ్ టేబుల్ పంపించామని చెప్పారు.  రెండేండ్ల తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా స్టూడెంట్లు తమ సందేహాలను తీర్చుకోవడానికి, వారి నుంచి సలహాలను తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ కౌన్సెలింగ్ సెల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెన్త్ క్లాస్ స్టూడెంట్లకు  స్టడీ అవర్లు జరుగుతున్నాయి. ఈ శనివారం వరకు క్లాసులు ఉండటంతో స్టూడెంట్లు తమ సందేహాలను నేరుగా టీచర్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ భాను తెలిపారు.  

ఈ నెల 31 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్స్

ఎస్‌‌ఎస్‌‌సీ, ఇంటర్మీడియట్(తెలంగాణ ఓపెన్ స్కూల్) పబ్లిక్ ఎగ్జామ్స్ కు స్టూడెంట్లు సెల్ ఫోన్లతో వస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని.. వారిని లోపలికి అనుమతించమని హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.  గురువారం సంబంధిత శాఖల అధికారులతో ఆఫీసులో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలో మే 31 నుంచి జూన్ 18వరకు తెలంగాణా ఓపెన్ స్కూల్ సొసైటీ (టీవోఎస్ఎస్) ఎస్ఎస్‌‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను   పూర్తి  చేయాలన్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా స్టూడెంట్లను తనిఖీ చేయాలన్నారు.  ఎగ్జామ్ సెంటర్లలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద ఓ ఏఎన్ఎం ఉండాలన్నారు. హైదరాబాద్ లో ఎస్ఎస్‌‌సీకి56, ఇంటర్‌‌‌‌ ఎగ్జామ్స్ కు 37కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 10,671 మంది స్టూడెంట్లు ఎస్ఎస్ సీ, 8,124 మంది స్టూడెంట్లు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయనున్నట్లు చెప్పారు.