కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడు.. ఎవరో తేలేది రేపే

కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడు.. ఎవరో తేలేది రేపే
  • పోలింగ్​ ప్రశాంతం.. ఓటేసిన 9500 మంది డెలిగేట్లు
  • బళ్లారిలో ఓటేసిన రాహుల్​ గాంధీ
  • రేపు ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్​ప్రకటన

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో 96% ఓటింగ్​ నమోదైందని పార్టీకి చెందిన సెంట్రల్​ఎలక్షన్​ అథారిటీ చైర్మన్​ మధుసూదన్​ మిస్ర్తీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 9,900 మంది డెలిగేట్లలో 9,500 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిస్ర్తీ మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్​, సాయంత్రం 4 గంటల దాకా కొనసాగిందన్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో100% ఓటింగ్​ నమోదైందన్నారు. అన్ని చోట్ల 90శాతానికి పైగా పోలింగ్​ రికార్డయినట్టు వివరించారు. ప్రశాంతయుత వాతావరణంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఈ ఎన్నికలతో చూపించిందన్నారు. ఇది రహస్య ఓటింగ్​ అని, ఎవరు.. ఎవరికి ఓటేశారో ఎవరికీ తెలియదని, ఈ విషయంలో భయపడొద్దని మిస్త్రీ తెలిపారు. 19న ఏఐసీసీ ఆఫీస్​లోనే ఓట్ల లెక్కింపు ఉంటుందని, అదే రోజు రిజల్ట్స్​ ప్రకటిస్తామని చెప్పారు. చెల్లని ఓట్లను పక్కనపెట్టేసి.. ఎవరికైతే 50శాతానికి పైగా ఓట్లు నమోదవుతాయో వారే కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని వివరించారు.  

బళ్లారిలో ఓటేసిన రాహుల్​గాంధీ
కాంగ్రెస్​ సీనియర్​ లీడర్లు రాహుల్​ గాంధీ, మల్లికార్జున్​ ఖర్గేలు తమ ఓటు హక్కును కర్నాటకలో వినియోగించుకున్నారు. భారత్​ జోడో యాత్రలో ఉన్న డెలిగేట్ల కోసం బళ్లారి జిల్లా సంగనకల్లులో ప్రత్యేకంగా పోలింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మరో 40 మంది డెలిగేట్లతో కలిసి రాహుల్​ గాంధీ ఓటేశారు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి మల్లికార్జున్​ ఖర్గే బెంగళూరులోని పార్టీ ఆఫీస్​లో ఓటేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. శశిథరూర్​ తనకు మిత్రుడేనని స్పష్టం చేశారు. కాగా, తిరువనంతపురంలో ఓటేశాక శశి థరూర్  మీడియాతో ​ మాట్లాడారు. పార్టీ లీడర్​ షిప్​ మార్పు కోసమే తాను ఎదురుచూస్తున్నట్టు శశి థరూర్​ చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.

ఈ రోజు కోసమే ఎదురు చూశా: సోనియా
ఏఐసీసీ హెడ్​క్వార్టర్​లో ఏర్పాటు చేసిన 68వ పోలింగ్​ బూత్​లో పార్టీ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి సోనియా గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత బయటికొచ్చిన సోనియా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశానని సోనియా గాంధీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, సీనియర్​ లీడర్లు జైరాం రమేశ్, అంబికా సోని, అజయ్​ మాకెన్, వివేక్​ తన్ఖాతో పాటు పలువురు నేతలు ఏఐసీసీ హెడ్​క్వార్టర్​లో ఓటేశారు.