
ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతూ టెక్ యుగం సాగుతున్న ఈ సమయంలో కూడా కొన్ని ప్రాంతాలు దానికి అనుగుణంగా ముందుకు సాగడం లేదు. చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు చేస్తున్నారు తల్లిదండ్రులు . పేదరికం, ఆడ పిల్లలను భారంగా భావించడం, పెద్దల నిరక్షరాస్యత వల్ల బాల్య వివాహాలు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలకు వివాహాలు చేస్తున్నారు. స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరగడం కూడా మరో ప్రధాన కారణం. తాజాగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఆలస్యంగా బాల్య వివాహం వెలుగులోకి వచ్చింది.
పట్టుమని 13 ఏళ్ళు కూడా నిండని బాలికకు పెళ్లి చేశారు. నందిగమ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే చిన్నారికి 40 ఏళ్ల వయసున్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ ఘటనపై బాలిక చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుడు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
పాప చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో తాహసిల్దార్ రాజేశ్వర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాలిక తల్లి స్రవంతితో పాటు వరుడు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్యపై, పెళ్లికి సహకరించిన పెద్దలపై కేసు నమోదు చేశారు. బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.