దళిత యువతిపై గ్యాంగ్​రేప్, హత్య

దళిత యువతిపై గ్యాంగ్​రేప్, హత్య

జైపూర్: రాజస్థాన్​లోని బికనీర్​ జిల్లాలో 20 ఏండ్ల దళిత యువతిని గ్యాంగ్ రేప్​ చేసి హత్యచేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు వారిని సస్పెండ్​ చేశారు. ఖాజువాలా ఏరియాలో మంగళవారం యువతి డెడ్​బాడీని గుర్తించామని ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్(ఐజీ) ఓం ప్రకాశ్​ తెలిపారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు ఇద్దరు కానిస్టేబుల్స్​తో సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్స్ మనోజ్, భగీరథ్ ​మూడో నిందితుడితో కలిసి యువతిని ఆమె ఇంటినుంచి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్​ చేసి హత్య చేశారని ఆరోపించారు.  కాగా, నిందితులను అరెస్టు చేసేవరకు యువతి డెడ్​ బాడీకి పోస్టుమార్టం నిర్వహించొద్దని బాధిత కుటుంబం ధర్నా చేసింది.

దీంతో ఇద్దరు పోలీసులును వెంటనే సస్పెండ్ చేశామని ఐజీ వెల్లడించారు. ఫోన్​కాల్ ​రికార్డుల ప్రకారం బాధిత యువతి, ప్రధాన నిందితుడికి పరిచయం ఉందని తేలిందని ఎస్పీ తేజస్విని గౌతమ్ చెప్పారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు అశోక్​ గెహ్లాట్ ​ప్రభుత్వంపై మండిపడ్డారు. యువతిపై అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు పోలీసులు కూడా నిందితులుగా తేలడం ప్రభుత్వానికి కళంకమని రాజేంద్ర రాథోడ్​ ట్వీట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్స్​ను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై  పౌర సరఫరాల మంత్రి ప్రతాప్​సింగ్​ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.