
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో మెయిన్ టెంపుల్ లో పెండింగ్ పనులను వైటీడీఏ ఆఫీసర్లు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా మెయిన్ టెంపుల్ లో గర్భగుడికి అభిముఖంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి బంగారు తొడుగులు బిగించే పనులను శుక్రవారం షురూ చేశారు. ధ్వజస్తంభ పీఠభాగాన్ని ఆరడుగుల మేర కృష్ణ శిలతో తయారు చేయగా, దానిపై నారవేపతో చేసిన ధ్వజస్తంభాన్ని అమర్చారు. మొత్తం 32 అడుగుల ఎత్తుతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తానికి బంగారు తొడుగులు బిగించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ధ్వజస్తంభ పీఠభాగానికి(అధిష్టాన భాగం) చెన్నైలో తయారు చేసిన బంగారు తొడుగులను అమర్చే పనులను మొదలుపెట్టారు. భక్తులను ఆకర్శించే విధంగా చూడచక్కని డిజైన్లతో తొడుగులను తయారు చేశారు. స్తపతుల పర్యవేక్షణలో జరుగుతున్న బంగారు తొడుగుల బిగింపు పనులు మూడు, నాలుగు రోజుల్లో ఫినిష్ చేస్తామని ఆఫీసర్లు చెప్పారు.
బంగారు తాపడానికి రూ. 9.14 కోట్ల విరాళాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమాన రాజగోపుర బంగారు తాపడం కోసం వచ్చిన విరాళాల వివరాలను శుక్రవారం ఆలయ ఆఫీసర్లు ప్రకటించారు. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 16 వరకు రూ.9 కోట్ల 14 లక్షల 32,622 విరాళంగా వచ్చాయి. దీంతోపాటు 2.433 కిలోల బంగారం విరాళంగా వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు.