ఏడాది బాబుకు ఎంత కష్టం

ఏడాది బాబుకు ఎంత కష్టం

లివర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడు
వైద్యం చేయించలేని స్థితిలో  తల్లిదండ్రులు

పెద్దపల్లి, వెలుగు: తమ ప్రేమకు ఫలంగా కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషించారు. కానీ ఆరు నెలల్లోనే ఆ బిడ్డకు పెద్ద కష్టమొచ్చింది. లివర్ చెడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని న్యూకొత్తపల్లి గ్రామానికి చెందిన ఐతరవేణి రమేష్ స‌మత దంపతులకు 13 నెలల క్రితం బాబు(వివాల్) జన్మించాడు. పెద్దపల్లిలోని సర్కార్ దవఖానాలో మూడున్నర కిలోలతో హెల్దీగానే పుట్టాడు. ఆరు నెలల వయస్సు రాగానే వివాల్ సిక్ కాగా కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పచ్చకామెర్లు(జ్యాండిస్) వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఇందుకు మందులు ఇచ్చారు.

జ్యాండిస్ తగ్గకపోవడంతో తిరిగి అదే ఆసుపత్రికి వెళ్ల‌గా వారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ చేసినప్పటికీ జ్యాండిస్ తగ్గకపోవడంతో లివర్ పరీక్షలు చేశారు. లివర్ డ్యామేజీ అయినట్లు గుర్తించారు. దీంతో బుడిబుడి
అడుగులు వేయాల్సిన చిన్నారి వివాల్ మంచానికే పరిమితమయ్యాడు. పొట్టబాగా ఉబ్బడంతో నడవలేని పరిస్థితి. ప్రస్తుతం ద్రవ పదార్థాలు మాత్రమే జీర్ణం అవుతున్నాయి . 13 నెలల వయస్సులోనే చిన్నోడికి వచ్చిన కష్టాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.
రూ.18 లక్షలు అవసరం..
వివాల్ కు లివర్ మార్చాలంటే దాదాపు రూ.18 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. మొదట రూ.11 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేస్తామని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పారు. ఊళ్లో వ్యవసాయ పనులు చేసుకునే వివాల్
తల్లి దండ్రులు ఇప్పటికే గడిచిన 7 నెలల్లో ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.6 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు మరో రూ.18 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని టెన్షన్ ప‌డుతున్నారు. దాతలు ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం