ఎక్స్ ప్రెస్ హైవేపై తిరగబడిన కారు.. 100 స్పీడ్ లో పల్టీలు

ఎక్స్ ప్రెస్ హైవేపై తిరగబడిన కారు.. 100 స్పీడ్ లో పల్టీలు


రంగారెడ్డి జిల్లా పీవీ ఎక్స్​ప్రెస్ హైవేపై ఓ కారు 100 కి.మీ.ల వేగంతో వచ్చి పల్టీ కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. 2023, జూన్ 15వ తేదీ ఉదయం రాజేంద్ర నగర్​ పీవీ నరసింహారావు ఎక్స్​ప్రెస్​ హైవేపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పిల్లర్​ నంబర్​ 215 దగ్గరకు రాగానే అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ప్రమాదం తర్వాత కారు తలకిందులుగా పడింది అంటే.. ఏ స్పీడ్ లో డ్రైవింగ్ చేస్తున్నారో అర్థం అవుతుంది. అదుపు తప్పిన సమయంలో ముందూ వెనకా వాహనాలు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మిగతా వాహనాలపై పడి ఘోరమైన యాక్సిడెంట్ అయ్యేంది. కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఎక్స్​ప్రెస్​హైవేపై భారీగా ట్రాఫిక్​ జాం అయింది. ఆఫీసులు, వివిధ పనులపై వెళ్తున్న ప్రయాణికులు ట్రాఫిక్​లో ఇబ్బంది పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన కారును పక్కకు తొలగించారు. కారు నంబరు టీఎస్​07 యూఎల్​ 5600గా ఉంది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా  చెబుతున్నారు పోలీసులు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు. 

కారు డ్రైవింగ్ చేస్తున్న వారు మద్యం మత్తులో ఉన్నారా లేక ఓవర్ స్పీడ్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందా అనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.