బండిపై నిరాధార ఆరోపణలు.. వ్యక్తిపై కేసు నమోదు

బండిపై నిరాధార ఆరోపణలు.. వ్యక్తిపై కేసు నమోదు

ఎంపీ బండి సంజయ్ కుమార్ పై ట్విట్టర్ లో తప్పుడు పోస్ట్ పెట్టిన  సచిన్. కె. రెడ్డి అనే వ్యక్తిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీతో పాటు ఆయన బామ్మర్ది భూ కబ్జాకు పాల్పడ్డారని పోస్ట్ చేయడంపై స్పందించిన బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్ తన ట్వీట్ లో ఎంపీ బండి సంజయ్, అతని బామ్మర్ది శ్రీనివాస్ కలిసి రేకుర్తి శివారులోని భూమిని కబ్జా చేసినట్టు నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది బండి సంజయ్ పరువుకు భంగం వాటిల్లేలా చేయడమే కాకుండా, బీజేపీ కార్యకర్తలమైన తమను కూడా అవమానించే విధంగా అభిప్రాయపడ్డారు.

ఎంపీ బండి సంజయ్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంతో పాటు బీజేపీ కార్యకర్తల పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించిన సచిన్ కె. రెడ్డిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు.దాంతో పాటు ట్విట్టర్ లో పెట్టిన షేర్ చేసిన పోస్టును కంప్లైంట్ తో జత చేశారు.