
ఈ కాలనీలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు యుద్ధంలో పాల్గొన్న వీర సైనికుల పిల్లలు. అందుకే ఈ ప్రాంతాన్ని శౌర్యానికి ప్రతీకగా చెప్తుంటారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ని ఆనుకుని ఉన్న ఈ కాలనీ పేరు ‘ముక్తా సైనిక్ వాసహత్’. దీనికి దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి.. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన 140 మంది సైనికుల వీరత్వం నుంచి పుట్టింది ఇది. అప్పట్లో కొల్హాపూర్లో ఉన్న ‘రాజారామ్ రైఫిల్స్’లో చేరిన సైనికులు ఎన్నో యుద్ధాలు చేశారు.
ఒకసారి యుద్ధంలో పాల్గొని యూనిఫాంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కొల్హాపూర్ యువరాజు ఛత్రపతి రాజారామ్ మహారాజ్ వాళ్లకోసం ఒక కాలనీని కట్టించాడు. అప్పటినుంచి వాళ్ల కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. ఇప్పటికీ ఈ కాలనీలో రాతిపై సైనికుల పేర్లను చెక్కిన ఒక స్మారక చిహ్నం ఉంది. ఇప్పుడు వాళ్ల వారసులు కూడా దేశానికి సేవ చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు.