అది కేరళలోని కన్నూర్ జిల్లా. అక్కడి రైతులు ఎక్కువగా జీడిపప్పు పండిస్తుంటారు. కానీ.. ఐదారేళ్ల నుంచి అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో నష్టపోతున్నారు. బ్రిజిత్ కృష్ణన్ మాత్రం ఆ నష్టాలను లాభాలుగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. తడి జీడిపప్పును మొలకెత్తించి, రుచికరమైన శ్నాక్స్‌గా మార్చి అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను లక్షల్లో సంపాదిస్తూనే తోటి రైతులను ఆదుకుంటున్నాడు.
బ్రిజిత్ కృష్ణన్ మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చదివాడు. కొన్నేండ్ల పాటు ఒక ఐటీ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. కానీ, కరోనా టైంలో అతని ఉద్యోగం పోయింది. వాళ్ల కుటుంబం ఏండ్ల తరబడి వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతోంది. ముఖ్యంగా వాళ్లు జీడిపప్పు సాగు చేస్తుంటారు. దాంతో అతను కూడా వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాడు.
బ్రిజిత్‌కు 13 ఎకరాల్లో జీడిపప్పు తోట ఉంది. కానీ.. అదే టైంలో మార్చి–మే నెలల్లో అకాల వర్షాలు కురిశాయి. అక్కడున్న వాళ్లంతా చిన్న రైతులే. వాళ్లకు స్టోరేజీ ఫెసిలిటీస్ పెద్దగా లేవు. దాంతో చేతికందిన జీడిపప్పు మొత్తం తడిసిపోయింది. నాణ్యత తగ్గడంతో ఫ్యాక్టరీల వాళ్లు కొనడానికి ముందుకు రాలేదు. ఒకవైపు ఉద్యోగం పోయింది. మరోవైపు పంటలో నష్టాలు.. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.
‘‘దేశంలో జీడిపప్పు ఉత్పత్తిలో కేరళ వాటా 15శాతం ఉంది. అందులో కన్నూర్ జిల్లాలో 63 శాతం ఉత్పత్తి అవుతోంది. కానీ, వాతావరణ మార్పులు ప్రతి ఏటా పంటను దెబ్బతీస్తున్నాయి. సంప్రదాయంగా జీడిపప్పును ఎండబెట్టి లేదా కాల్చి అమ్ముతుంటాం. వాటికి వ్యాల్యూ యాడ్ చేసి మరో ప్రొడక్ట్‌ని ఉత్పత్తి చేసేందుకు పెద్దగా అవకాశాలు లేవు. కొబ్బరి, మామిడి లాంటివాటిని నిల్వ చేసుకోవచ్చు.. కానీ, జీడిపప్పుకు అలాంటి ఆప్షన్ లేదు. జీడిపప్పు తడిస్తే రంగు మసకబారి, రుచి తగ్గిపోతుంది. అందుకే ఎవరూ కొనరు” అని చెప్పాడు బ్రిజిత్.
ఆరు నెలలు నిల్వ
వెజిటేరియన్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ట్రెండ్‌ను గమనించిన బ్రిజిత్‌కు తడి జీడిపప్పును మొలకెత్తించి అమ్మాలనే ఆలోచన వచ్చింది. సాధారణంగా జీడిపప్పు పండిన 90 రోజుల్లోనే మొలకెత్తుతుంది. ఆ తర్వాత ఈజీగా మొలకెత్తే అవకాశాలు తక్కువ. అంటే మొలకెత్తిన జీడిపప్పును సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేయడం కుదరదు. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ సాయంతో రీసెర్చ్, ప్రయోగాలు చేశాడు. చివరకు 90రోజుల టైంని 180–200 రోజుల వరకు పెంచే టెక్నిక్‌ని తెలుసుకున్నాడు. అదే జపాన్‌లో ఉపయోగించే రిటార్టింగ్ టెక్నాలజీ. జీడిపప్పుని హీట్ ట్రీట్‌మెంట్ సాయంతో రూమ్ టెంపరేచర్‌లోనే ఎయిర్‌టైట్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో కోల్డ్ స్టోరేజ్ అవసరం లేకుండానే ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొలకెత్తించుకోవచ్చు.
ఈటరీ మలబారికాస్
ఎన్నో ప్రయోగాల తర్వాత 2021లో ‘ఈటరీ మలబారికాస్’ అనే వెంచర్ స్టార్ట్ చేశాడు బ్రిజిత్. అతని మొదటి ఇన్వెస్ట్‌మెంట్ కేవలం రూ. లక్ష మాత్రమే. తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 25 లక్షల గ్రాంట్ వచ్చింది. ప్రస్తుతం అతను ఈ స్టార్టప్ ద్వారా జీడిపప్పు మొలకలతో మంచూరియన్, బటర్ మసాలా, మలై, షెజ్వాన్, మలబార్ మసాలా, పికిల్స్ లాంటివి తయారుచేసి మార్కెట్‌లో అమ్ముతున్నాడు. ప్రస్తుతం ఒక కిలో స్ప్రౌటెడ్ జీడిపప్పు ధర రూ. 1,000 ఉంది. కేరళ, బెంగళూరు, ముంబైలోని ప్రముఖ హోటల్స్, ఫుడ్ సప్లై కంపెనీలు, సెలబ్రిటీ షెఫ్‌లకు సప్లై చేస్తున్నాడు.
స్థానిక రైతులకు సాయం
బ్రిజిత్ రెగ్యులర్‌గా కనీసం 11 మంది స్థానిక రైతుల నుంచి మంచి ధరకు తడి జీడిపప్పును కొంటున్నాడు. వాటిని మొలకెత్తించి అమ్ముతున్నాడు. ‘‘వర్షాల వల్ల పంట తడిచినా ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు!” అని బ్రిజిత్ సంతోషంగా చెప్తున్నాడు. ఈ బిజినెస్‌లో ఏటా సుమారు రూ. 25 లక్షల టర్నోవర్ వస్తోంది. ఇప్పుడు ఈ వెంచర్ మరింత విస్తరిస్తోంది.
ఆరోగ్యకరం
పారగాన్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లలో కార్పొరేట్ చెఫ్‌గా పనిచేస్తున్న థామస్ “మొలకెత్తిన జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైనది. దాంతో అనేక రకాల వంటకాలు చేస్తున్నాం. ఇది మామూలు దుకాణాలలో అందుబాటులో ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా ఈటరీ మలబారికాస్ నుంచి తెప్పిస్తున్నాం. ఆరోగ్యకరమైన, వెరైటీ వంటకాలకు ఇది బాగుంటుంది. ప్రజలు కూడా స్ప్రౌట్స్తో చేసిన ఫుడ్‌ని బాగా ఇష్టపడుతున్నారు. అందుకే కస్టమర్లు రిపీట్ ఆర్డర్లు ఇస్తున్నారు” అంటున్నాడు.
