
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ఓ కానిస్టేబుల్ వీరంగం చేశాడు. ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై అతడి బాబాయిని కారుతో ఢీకొట్టి బ్యానెట్ పైనే కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న రాత్రి ముచ్చింతల్‌లోని స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఇంటి ముందు నుంచి పవన్ కళ్యాణ్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే పదేపదే తన ఇంటి ముందు నుంచి ఎందుకు వెళ్తున్నావని ఆ యువకుడ్ని జ్ఞానేశ్వర్ ప్రశ్నిం చాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. పవన్ కల్యాణ్‌పై జ్ఞానేశ్వర్ దాడి చేశాడు. కులం పేరుతో తిట్టాడు. ఆ తర్వాత కొంతసేపటికి అదే దారిలో పవన్‌కల్యాణ్ తన బాబాయ్ రాజుతో కలిసి వెళ్తున్నారు. అదే టైమ్‌లో కారులో వచ్చిన కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఆ ఇద్దరిపైకి కారును పోనిచ్చాడు. దీంతో రాజు పైకి ఎగిరి కారు బ్యానెట్‌పై పడ్డాడు. అయినా ఆగకుండా కానిస్టేబుల్ అలాగే కారును దాదాపు 200 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. రాజు గాయపడ్డాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ శంషాబాద్ రూరల్ పీఎస్‌లో కంప్లయింట్ చేశాడు. అయితే పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని, కానిస్టేబుల్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, కానిస్టేబుల్ దాడిలో పవన్‌కల్యాణ్‌కు సైతం గాయాలు కాగా హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. అతడిని స్థానిక బీఎస్పీ నేతలు పరామర్శిం
చారు. ఈ ఘటనపై విచారణ జరిపి కానిస్టేబుల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.