సొంతింటి కల.. పీడ కలగా మారింది

సొంతింటి కల.. పీడ కలగా మారింది

ఓ కుటుంబం కన్న సొంతింటి కల.. పీడ కలగా మారింది. దంపతులిద్దరూ కష్టపడి ఒక సొంతిల్లు కొనుక్కున్నారు. మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ఇంట్లోకి వెళ్లే రోజే వాళ్లకు ‘‘ది వాచర్‌‌‌‌” అనే పేరుతో ఒక లెటర్‌‌‌‌ వచ్చింది. అందులో ఉన్న విషయం చదివి ఇద్దరూ షాక్ అయ్యారు. చివరికి గృహప్రవేశం చేయకుండానే కొన్నాళ్లకు ఆ ఇంటిని అమ్మేశారు. ఇంతకీ ఆ లెటర్‌‌‌‌లో ఏముంది? 

డెరెక్ బ్రాడ్డస్, అతని భార్య మరియ కలిసి 2014లో న్యూజెర్సీలోని వెస్ట్‌‌ఫీల్డ్‌‌లో ఒక ఇల్లు కొన్నారు. దాని ధర 1.3 మిలియన్ల అమెరికన్‌‌ డాలర్లు. అందులో ఉన్న ఆరు బెడ్‌‌రూమ్‌‌లను వాళ్లకు నచ్చిన ఇంటీరియర్‌‌‌‌తో డిజైన్‌‌ చేయించుకున్నారు. అందుకోసం మరో లక్ష డాలర్ల వరకు ఖర్చు చేశారు. అదే సంవత్సరం జూన్‌‌లో ఒకరోజు.. సాయంత్రం వరకు పెయింటింగ్‌‌ పనులు పూర్తి చేయించాడు డెరెక్‌‌. అతను ఆ ఇంటికి వెళ్లక మూడురోజులు అయింది. అందుకే అక్కడినుంచి బయల్దేరే ముందు మెయిల్‌‌ బాక్స్‌‌ చెక్‌‌ చేశాడు. అందులో ఇంటి రిపేర్‌‌‌‌కు సంబంధించిన కొన్ని బిల్స్‌‌, ఒక తెల్లని కార్డు ఉన్నాయి. ఆ కార్డు ఇంట్రెస్టింగ్‌‌గా ఉండడంతో  ఓపెన్‌‌ చేసి చూశాడు. 

నువ్విక్కడకు ఎందుకొచ్చావ్‌‌? 

దానిపైన ‘‘ది న్యూ ఓనర్‌‌‌‌.. ఈ ఇంటికి మీరు ఎలా వచ్చారు? ఈ ఇల్లే తన శక్తితో మిమ్మల్ని పిలిచిందా? ఈ ఇల్లు కొన్ని దశాబ్దాలుగా నా కుటుంబ ఆస్తి. ఈ ఇల్లు త్వరలో తన 110వ పుట్టినరోజు జరుపుకోబోతోంది. ఆ సందర్భంగా నాకు కొన్ని బాధ్యతలు అప్పగించింది. ఇంటిని 1920ల్లో మా తాత చూసుకునేవాడు. 1960ల్లో మా నాన్న చూసుకున్నాడు. ఇప్పుడు నా టైం వచ్చింది. అసలు ఈ ఇంటి చరిత్ర నీకు తెలుసా? దాని గోడల లోపల ఏముందో తెలుసా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?”అని రాసి ఉంది. ఈ లెటర్‌‌‌‌ చూసిన తర్వాత డెరెక్‌‌లో భయం మొదలైంది. ఆ లెటర్‌‌‌‌ ఎవరు రాశారు? ఎందుకు రాశారు? తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఏ ఆధారం దొరకలేదు. లెటర్‌‌‌‌ పై ఫ్రం అడ్రస్ లేదు. కానీ.. చివరలో ‘ది వాచర్‌‌‌‌’ అని సంతకం ఉంది. ఆ లెటర్ వచ్చిన రెండు నెలల్లో ఒక్కొక్కటిగా తన పాత ఇంట్లోని సామాన్లను ఈ ఇంటికి మార్చాడు. అప్పుడప్పుడు తన భార్య మరియ, వాళ్ల ముగ్గురు పిల్లలు కూడా ఇంటికి వచ్చేవాళ్లు. పొరుగిళ్లలో ఉన్న పిల్లలతో కలిసి డెరెక్ పిల్లలు ఆడుకునేవాళ్లు. 

రెండో లెటర్‌‌‌‌ 

అంతా మామూలుగానే ఉంది అనుకునే టైంలో మరో లెటర్ వచ్చింది. అందులో ‘‘ఇప్పటికే నువ్వు ఈ ఇంటికి కాంట్రాక్టర్లను తీసుకొచ్చావు. వాళ్లు దాన్ని నాశనం చేశారు. నేను అన్నీ గమనిస్తున్నా. అది మంచి పని కాదు. నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను వాళ్లను చూశాను. ఈ ఇంటిని మీరు యంగ్‌‌ బ్లడ్‌‌తో నింపాలి అనుకుంటున్నారా? అయితే.. మంచిదే. నీ పిల్లల పేర్లు తెలుసుకున్నాక.. నేనే వాళ్లను పిలుస్తా” అని రాసి ఉంది. ఆ లెటర్‌‌‌‌ చూసిన తర్వాత డెరెక్ బాగా భయపడ్డాడు. ఆ లెటర్ చదివినప్పుడు రాత్రి పది గంటలు. ఆ టైంలో డెరెక్ ఒంటరిగా ఉన్నాడు. వెంటనే ఇంటి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. వెస్ట్‌‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌కు కాల్ చేశాడు. ఒక ఆఫీసర్‌‌‌‌ వచ్చి, లెటర్‌‌‌‌ చదివి, వివరాలు తెలుసుకున్నాడు. కానీ.. ఒక్క క్లూ కూడా దొరకలేదు.

ఎవరతను? 

ఆ ఇంటి ముందు నుంచి రోజూ కొన్ని వందల కార్లు వెళ్తుంటాయి. ఆ దారి నుంచి ఎంతో మంది నడుస్తుంటారు. వాళ్లలో ఆ ఇంటిని ఎవరు వాచ్‌‌ చేస్తున్నారో గుర్తించడం చాలా కష్టం. పైగా ఏరియాకు వాళ్లు కొత్తేమీ కాదు. ఆ ఇంటి పక్క వీధిలోనే డెరెక్ భార్య ఉండేది. ఆ  ఇంటి గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. 
రెండో లెటర్‌‌‌‌ ఇచ్చిన షాక్‌‌ నుంచి తేరుకోక ముందే మూడో లెటర్ వచ్చింది. అందులో కూడా ‘‘మీకు చావు తప్పదు” అనే ఉద్దేశంతో కొన్ని విషయాలు రాశాడు. ఇంటి గురించి పూర్తిగా తెలిసినట్టే రాశాడు. దాంతో ఆ ఇంట్లో అంతకుముందు ఉన్న  జాన్, ఆండ్రియాలపై 2015లో కేసు వేశారు. ఇన్వెస్టిగేషన్‌‌ చేస్తే.. వాళ్లకు ఈ లెటర్లతో ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. జాన్‌‌ ఆ ఇంట్లో దాదాపు 23 ఏండ్లు ఉన్నాడు. అయితే.. ఆ ఇంటిని ఖాళీ చేసేముందు వాళ్లకు కూడా ‘ది వాచర్‌‌’ పేరుతో ఒక లెటర్‌‌‌‌ వచ్చింది. కానీ.. వాళ్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 

చిక్కడు.. దొరకడు

ఆ వాచర్‌‌ ఎవరనేది కనిపెట్టేందుకు పోలీసులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. కనిపెట్టలేకపోయారు. ఇక లాభం లేదని డెరెక్‌‌  ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌‌‌‌, మాజీ ఎఫ్‌‌బీఐ అధికారిని అపాయింట్‌‌ చేశాడు. వాళ్లు కూడా చాలామందిని అనుమానించి విచారించారు. కానీ.. వాచర్‌‌‌‌ని కనిపెట్టలేకపోయారు. వాచర్‌‌ గురించి తెలిశాకే ఆ ఇంట్లోకి వెళ్లాలని డెరెక్‌‌ డిసైడ్ అయ్యాడు. ఎంతకీ అతనెవరనేది తెలియకపోవడంతో 2016లో ఆ ఇంటిని కూల్చి మళ్లీ కట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. కానీ వాచర్ నుండి మళ్లీ ఒక లెటర్ వచ్చింది. ‘‘ఆ ఇంటికి హాని చేస్తే ప్రతీకారం తీర్చుకుంటాన’’ని అందులో ఉంది. దాంతో చేసేదేమీ లేక 2019లో ఆ ఇంటిని 4.4 లక్షల డాలర్ల నష్టానికి అమ్మేశాడు డెరెక్‌‌.