పేదోళ్లకు న్యాయం జరగట్లే..ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్న రైతన్న

పేదోళ్లకు న్యాయం జరగట్లే..ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్న రైతన్న

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి, వెలుగు:తెలంగాణ వచ్చినా పేదోళ్లకు న్యాయం జరగడం లేదని, లంచం తీసుకుని తన భూమి మరొకరికి పట్టా చేశారంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఓ రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలంటూ ప్రభుత్వ విప్​కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. ఈ సంఘటన భూపాలపల్లిలో మంగళవారం జరిగింది. భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఓ వైపు జరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ విప్‌‌‌‌భాను ప్రసాదరావు జాతీయ పతాకం ఆవిష్కరించి జెండా వందనం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఇంతలోనే ఎక్కడినుంచో వచ్చిన ఓ రైతు పురుగుల మందు డబ్బా చేతపట్టుకొని నాకు న్యాయం చేయాలి సారూ.. అంటూ ఆయన కాళ్లపై పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా పేదోళ్లకు న్యాయం జరగడం లేదని, మీరు పట్టించుకోకపోతే నాకు చావే శరణ్యం అంటూ దుఃఖించాడు. రెవెన్యూ అధికారులు రూ. 5 లక్షలు లంచం తీసుకొని తన భూమిని వేరొకరికి పట్టా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ రైతు చేతిలోని పురుగుల మందు డబ్బా తీసుకొని అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు జీపులో కూర్చోబెట్టారు.

కోర్టులో కేసున్నా..

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌కు చెందిన పెద్దింటి మధుకర్‌‌‌‌కు గ్రామంలో 3.35 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని చాలా యేళ్లుగా ఆయన సాగు చేసుకుంటున్నారు. అయినా వీరి కుటుంబసభ్యుల పేర్లు కాకుండా వేరొకరికి పట్టాదారు పాస్‌‌‌‌బుక్‌‌‌‌జారీ చేశారు. దీంతో ఆయన కోర్టులో కేసు వేశారు. కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌మండల రెవెన్యూ అధికారులు కేసు ఉండగానే రూ.5 లక్షలు లంచం తీసుకొని తనకు కాకుండా వేరొకరికి కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌బుక్‌‌‌‌జారీ చేసినట్లుగా మధుకర్‌‌‌‌ఆరోపిస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ జిల్లా జాయింట్‌‌‌‌కలెక్టర్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌కార్యాలయాల చుట్టూ చాలాసార్లు తిరిగానని, అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేశానని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగానైనా నిరసన వ్యక్తం చేస్తే తనకు న్యాయం జరుగుతుందనే భావనతో ప్రాణాలకు తెగించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వ విప్‌‌‌‌భాను ప్రసాదరావు మాట్లాడుతూ పూర్తి విచారణ జరిపి మధుకర్​కు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌‌‌‌ను ఆదేశించినట్లుగా తెలిపారు.

వందేళ్ల తర్వాత ముంబైకి తుఫాన్ ముప్పు