చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం..డెకరేషన్ గోడౌన్ లో మంటలు

చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం..డెకరేషన్ గోడౌన్ లో మంటలు

హైదరాబాద్ : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. వీఎస్ టీ లోని అన్నపూర్ణ బార్ సమీపంలో ఉన్న  ఓ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు.

డెకరేషన్ సామాను గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మరో రెండు గోడౌన్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్స్ తో పాటు వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్స్ పాతవి కావడంతో పైకప్పు రేకులు కూలిపోతున్నాయి. పక్కన ఉన్న మరో LED లైట్స్ గౌడౌన్ లోకి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. LED లైట్స్ గోడౌన్ లోకి పాకితే మరింత ఎక్కువగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

మంత్రి తలసాని హెచ్చరిక 

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. చిక్కడపల్లోని డెకరేషన్ సామాగ్రి గోడౌన్ కు వెళ్లారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా గోడౌన్స్ నిర్వహించే వారిని మంత్రి తలసాని హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇదే అందరికీ ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమంగా నిర్వహిస్తున్న వాణిజ్య భవనాలను, గోడౌన్స్ ను గుర్తిస్తామని చెప్పారు. నగరంలో ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గురైన గోడౌన్ ను కూల్చివేస్తామని చెప్పారు. 

నిబంధనలు పాటించకుంటే చర్యలు 

అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ జోన్  డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అక్రమ గోడౌన్ లను గుర్తించి.. వాటి యజమానులకు నోటీసులు అందిస్తామన్నారు. ఇప్పటి నుంచి అన్ని వ్యాపార సంస్థలు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలన్నారు.