హైదరాబాద్లో కుంగిన భవనం.. పక్కనే కొత్త బిల్డింగ్ కోసం.. ఐదు ఫీట్ల గుంత తవ్వడంతో ఘటన

హైదరాబాద్లో కుంగిన భవనం.. పక్కనే కొత్త బిల్డింగ్ కోసం.. ఐదు ఫీట్ల గుంత తవ్వడంతో ఘటన

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్ నియోజకవర్గం చాక్నవాడిలో నాలుగు అంతస్తుల భవనం కుంగింది. వివరాల్లోకి వెళ్తే.. గోషామహల్ కు చెందిన సునీత 2021లో 60 గజాల్లో నాలుగు అంతస్తుల భవనం నిర్మించింది. నిర్మాణం సమయంలో బేస్ మెంట్ ఐదు ఫీట్లు వేయించారు. ఇటీవల సునీత సమీప బంధువు అయిన గోవింద్.. ఆ భవనం పక్కనే ఉన్న 60 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి రెండు ఫ్లోర్ల అనుమతి తీసుకొని పనులు ప్రారభించారు.

బేస్ మెంట్ వేయడాని జేసీబీ సహాయంతో ఐదు ఫీట్ల కంటే లోతుగా గుంతలు తీశారు. పక్క భవనం బేస్ మెంట్ కదిలి.. గోడలు బీటలు పడ్డాయి. స్థానికులు గమనించి జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని అందులో ఉన్నవారిని ఖాళీ చేయించారు. టెక్నీకల్ టీమ్ పక్కకు జరిగిన బేస్ మెంట్ కు మరమ్మతులు చేపట్టారు.

రాడ్లు సహాయంతో బేస్ మెంట్ కు సపోర్ట్ గా పనులు చేస్తున్నారు. 15 రోజుల వరకు భవనంలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు. 15 రోజుల తర్వాత మరోసారి పరిశీలించి అనుమతిస్తామని తెలిపారు. అయితే చాక్నవాడిలో కుంగిపోయిన భవనానికి 200 మీటర్ల దూరంలో ప్రధాన రోడ్డు ఉంది. ఆ రోడ్డు కింద భాగంలో నాలా నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు గుండా హెవీ వెహికల్స్​వెళ్తుంటాయి. దీంతో గతంలో నాలుగు సార్లు రోడ్డు కుంగిపోవడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. భవనం కుంగిపోవడానికి కారణం నాలానే అయ్యి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.