- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్పిడమర్తి రవి
ఓయూ, వెలుగు: అక్టోబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రెండు తరాల తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని, భారీగా ఉద్యమకారులు తరలిరావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు రహీం ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కాలేజీ ముందు ఉద్యమకారులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఉద్యమకారులను వెంటనే గుర్తించి, వారికి 250 గజాల ఇంటి స్థలం, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, పెన్షన్ గుర్తింపు కార్డులు, ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతోనే సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అందే కృష్ణ, కందుల శీను, డాక్టర్ ప్రభాకర్, జానయ్య, గడ్డం శ్రీరాములు, సూర్యారావు, గణేశ్, సురేశ్, కృష్ణమోహన్, గాంధీ, శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.
