నేటి (సెప్టెంబర్ 22) నుంచి గ్రామాల్లో ఫార్మర్‌‌ ఐడీ నమోదు.. అగ్రి సేవలన్నీ ఇక డిజిటల్‌‌ బాట

నేటి (సెప్టెంబర్ 22) నుంచి గ్రామాల్లో ఫార్మర్‌‌ ఐడీ నమోదు.. అగ్రి సేవలన్నీ ఇక డిజిటల్‌‌ బాట

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంగళవారం నుంచి ఈనెల 30 వరకు గ్రామాల్లో ఫార్మర్‌‌ ఐడీ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులకు వ్యవసాయ శాఖ మరోసారి అవకాశం కల్పించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు, ఇతర వ్యవసాయ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు అగ్రిస్టాక్‌‌ ఫార్మర్‌‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు తమ ఫార్మర్‌‌ ఐడీని తెలుసుకోవాలని సూచించింది.

రైతు రిజిస్ట్రీలో నమోదు పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేకమైన ఫార్మర్‌‌ ఐడీ కేటాయించే విధానం అమలులో ఉంది. అగ్రిస్టాక్‌‌ సమాచారం ప్రకారం.. ఫార్మర్‌‌ రిజిస్ట్రీ రైతు గుర్తింపు, భూమి వివరాలను అనుసంధానించి ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలుకు డిజిటల్‌‌ ప్రాతిపదికగా పని చేయనుంది. 

గ్రామాల్లో రైతుల వివరాల నమోదుకు ఏఈవోలు అందుబాటులో ఉండనున్నారు. ఫార్మర్‌‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకోని రైతులు తమ ఆధార్‌‌ కార్డు, పట్టా పాస్‌‌బుక్‌‌, ఆధార్‌‌కు అనుసంధానమైన మొబైల్‌‌ నంబర్‌‌తో ఏఈవోలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆధార్‌‌–ఓటీపీతో ఫార్మర్‌‌ ఐడీ
ఇప్పటికే నమోదు పూర్తి చేసుకున్న రైతులు తమ ఫార్మర్‌‌ ఐడీని ఆన్‌‌లైన్‌‌లో తెలుసుకోవచ్చు. ఫార్మర్‌‌ రిజిస్ట్రీ పోర్టల్‌‌లోకి వెళ్లి ఆధార్‌‌ నంబర్‌‌ను నమోదు చేయాలి. అనంతరం ఆధార్‌‌కు అనుసంధానమైన మొబైల్‌‌ నంబర్‌‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే ఫార్మర్‌‌ ఐడీ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

రైతులు తమ ఈ ఫార్మర్‌‌ ఐడీని భద్రపరుచుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఈ ఐడీతో భవిష్యత్​లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందవచ్చు.