- వరంగల్ ఎంజీఎం సందర్శన
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్స్‌కు నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఆదేశించారు. సోమవారం ఎంజీఎంను రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ వాణి, కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి సందర్శించారు. ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు కూలిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు.
ఘటనలో గాయపడిన వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితిని ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం, వైద్యులు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.
నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంజీఎంలో పైకప్పు కూలడం, పెచ్చులు ఊడిపడడంతో పేషెంట్స్‌కు గాయాలు కావడం బాధకరం అని అన్నారు.
హాస్పిటల్ బిల్డింగ్ భద్రత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆఫీసర్లను ఆదేశించినట్లు చెప్పారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన సౌలతులు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు.
