పొయెట్రీ కార్నర్: ఆవలి తీరం

పొయెట్రీ కార్నర్: ఆవలి తీరం

ఆవలి తీరం

నువ్వటు వెళ్లటానికి
ఏదో ఒక నావ కచ్చితంగా
ఏర్పాటై వుంటుంది... శ్రద్ధగా చూడు
అలుముకున్న చిక్కుముళ్లు విడివడి
అవలీలగా ఉన్నపళంగా
కదిలిపోతాననీ  భ్రమ పడకు
ఇక్కడ ఒదలలేని ఎదలతో
ముందు ముందు నువ్వెంత ఊగిసలాడాలో...
లంగరేసి ఆపుకునే
పడవకాదు మనల్ని చుట్టుకున్న బతుకంటే...
ఇటేపు నువ్వు ఆసాంతం ఖాళీఅయితేనే....
అటేపు నువ్వు
పూర్తిగా భర్తీ అవుతావని గుర్తించు!

అంబరాన్ని అంబుధిలో చూస్తావెందుకు
నడి సంద్రంలో
నువ్వు నిలబడ్డ నీటితెప్ప
అలా ఊయలలూపుతూనే ఉంటుంది
మైమరిచి మమేకమై ఓలలాడిపోకు
బతుకుబుట్టను బోర్లా పడేసే
నీటి సుడులుంటాయి జర్రంత గమనించుకో...

వేటాడే డేగకన్ను మాదిరిగానే
ఆకాశపు అంచుల నుంచే
జలచరాలనూ సుదూరతీరాలను చూడు
కడలిని దాటటమంటే...
అడుగుల్ని కూడుకోవటం అసలు కాదు
కలిమిలేములను దాటటం
కన్నీళ్ల కావడిని మోయటం
కళ్లల్లో ఒత్తుల్ని వెలిగించుకుని
చిమ్మని చీకట్లలోనూ...
కత్తుల వంతెనల్ని దాటటం లాంటిదే...

గూళ్లనూ ఉండే ఊళ్లను  వోదిలి  
వలస పక్షుల్లా
వచ్చిపోలేని కొన్ని రెక్కలుంటాయిచూడు
నువ్వు గుర్తించవు గానీ...
ఇసుకపై రాసుకున్న బాసల్ని
అలలు ఎప్పుడు తుడిపేస్తూనే ఉంటాయి
ఏ తీరాలకు
ఎవరు ఎప్పుడు చేరాలో
కాలమే కొలమానమై దారిపొడవున
హెచ్చరికలను జారీ చేస్తూనే ఉంటుంది

పంచభూతాలకూ తలొగ్గి జల్లులా
ఎంత భద్రంగా
నిన్నునీవు భద్రపరుచుకున్నా
ఏదో ఒక ఉప్పెన చటుక్కున లాక్కెడుతుంది
గాలికి రెపరెపలాడుతున్న
తెల్లని తెరచాపలపై తుఫాను అలలలా...
కాలధర్మం తచ్చాడుతుంది బాగా చూడు

ఒకానొక రోజు
సముద్రం నిశ్శబ్దమైపోతుంది
ఆవలి తీరంలో నిస్తేజంగా నీ దేహం
గగనమంతా పక్షుల రొద..!

-డా. కటుకోఝ్వల రమేష్