డెడ్ బాడీని ఎలుకలు కొరికిన ఘటన.. సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ

డెడ్ బాడీని ఎలుకలు కొరికిన ఘటన.. సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ

అబిడ్స్, వెలుగు: వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీలో డెడ్​బాడీని ఎలుకలు కొరికిన ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌ డా.జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను పరిశీలించిన కమిషన్‌‌.. ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్‌‌ కలెక్టర్‌‌ను ఆదేశించింది.

రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య (58) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖాన మార్చురీలో రాత్రంతా ఉంచారు. మరుసటి రోజు ఉదయం పరిశీలించగా కంటి, కంటి పైభాగంలో ఎలుకలు కొరికినట్లుగా గుర్తులు కనిపించినట్లు వార్తల్లో పేర్కొన్నారు. మృతదేహాలకు గౌరవప్రదమైన, మానవీయమైన సంరక్షణ కల్పించడం ప్రభుత్వ దవాఖాన బాధ్యత అని పేర్కొంది.

వార్తల్లో వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మృతదేహాన్ని మార్చురీలో ఉంచిన పరిస్థితులు, ఫ్రీజర్‌‌, విద్యుత్‌‌ సౌకర్యాల లభ్యత, పారిశుధ్యం, ఎలుకలు, కీటకాల నియంత్రణ చర్యలు, మృతదేహంపై గాయాల గుర్తులకు దారితీసిన పరిస్థితులు, మార్చురీ నిర్వహణకు బాధ్యులైన అధికారులు, సిబ్బంది వివరాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టిన చర్యలను నివేదికలో పొందుపరచాలని కలెక్టర్‌‌ను ఆదేశించింది. కేసును అక్టోబర్‌‌ 27న నివేదిక సమర్పణ కోసం విచారణకు ఉంచింది.