సిద్దిపేట, వెలుగు: అప్పటి వరకు తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఓ విద్యార్థిని కడుపు, ఛాతి నొప్పితో ఒక్కసారిగా కిందపడింది. హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందింది. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన ప్రకారం.. బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుర్రం తిరుపతిరెడ్డి, శ్రావణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మిట్టపల్లి సమీపంలోని కేజీబీవీలో పెద్ద పాప వర్ష 9వ తరగతి, చిన్న పాప హర్షిణి(11) ఏడో తరగతి చదువుతున్నారు. శుక్రవారం రాత్రి హర్షిణి అందరితో పాటే రాత్రి భోజనం చేసి, తోటి స్టూడెంట్స్ తో ఆడుకుంటోంది. ఒక్కసారిగా కడుపులో, ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయింది.
టీచర్లు ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని సురభి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే పాప చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు ధ్రువీకరించారు. విద్యార్థిని తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
