నవాబుపేట, వెలుగు: వరి పొలంలో పురుగుమందు పిచికారి చేస్తూ ఓ గవర్నమెంట్ టీచర్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామ పంచాయతీ రుక్కంపల్లి గ్రామానికి చెందిన మరికంటి బాలరాజు(50) మండలంలోని పుట్టోనిపల్లి తండా ప్రైమరీ స్కూల్ టీచర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం తన సొంత పొలంలో వరి పంటకు పురుగు మందు పిచికారి చేస్తూ.. ఛాతీలో బరువుగా ఉందని అక్కడే ఉన్న కొడుకుకు చెప్పాడు. సాయం కోసం పక్క చేలల్లో వారిని పిలుస్తుండగానే, బాలరాజు స్పృహ తప్పి పడిపోయాడు.
గ్రామస్తుల సాయంతో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి, ఆ తరువాత జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పవర్ స్ప్రేయర్‌తో పురుగు మందు కొడుతున్న సందర్భంలో శరీరంలోకి పాయిజన్ పోవడంతో గుండెపోటుకు గురై చనిపోయి ఉంటాడని డాక్టర్లు పేర్కొన్నారు. ఇదిలాఉంటే బాలరాజు రెండు రోజుల కింద పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నియమితులయ్యాడని తోటి టీచర్లు తెలిపారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల ఎంఈవో రాజునాయక్, మండల ఉపాధ్యాయులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
