పోడు రైతులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవ

పోడు రైతులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవ

రాష్ట్రంలో పోడు సాగుదారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెనుబల్లి మండలంలోని చౌడవరం గ్రామంలో పోడు సాగుదారులకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. 

చౌడవరం గ్రామ పరిధిలోని పోడు భూములలో సాగు చేసుకుంటున్న రైతులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీంతో  ఇరు వర్గాల మధ్య  తోపులాట చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి పోడు భూములలో సాగు చేసుకుంటున్న తమను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదంటూ సాగుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ సిబ్బందికి సంబంధించిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసేందుకు పోడు సాగుదారులు ప్రయత్నించారు. దీంతో పలువురు ఫారెస్ట్ సిబ్బంది పొడు సాగుదారులతో జరిగిన తోపులాటలో కింద పడి, స్వల్పంగా గాయపడ్డారు.

వానాకాలం సీజన్‌ వేళ పోడు భూముల వద్ద మళ్లీ ఉద్రిక్తతలు
వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో రైతులు పోడు భూముల్లో సాగుకు సన్నద్ధమవుతుండగా.. అటవీ అధికారులు అడ్డుకుంటుండడంతో అడవుల్లో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గతంలో ప్రతి సీజన్‌లోనూ అటవీ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణలు ప్రతిసారి జరిగేవి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అర్హులైన రైతులకు హక్కు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించిన కేసీఆర్  ప్రభుత్వం.. గత ఏడాది నవంబరు 8 నుంచి డిసెంబరు 16 వరకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. అట్టహాసంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుంచి సుమారు 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు హక్కు పత్రాలను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా సమస్యల  పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులు అయోమయానికి గురవుతున్నారు.