ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిన ఇసుక అక్రమ రవాణా

ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిన ఇసుక అక్రమ రవాణా
  • నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య ముదురుతున్న పంచాయితీ
  • ఇసుక అక్రమ రవాణాలో నకిరేకల్ లారీలకు నో ఎంట్రీ
  • తుంగతుర్తి నుంచి ఇసుక సప్లైను అడ్డుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే
  • పార్టీ పెద్దల అండతో రెచ్చిపోతున్న మాఫియా

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. ఇసుక రవాణాలో వాటాలు కుదరక తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లింది. ఇద్దరు ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే కు పైస్థాయిలో పలుకుబడి స్ట్రాంగ్​గా ఉండటంతో దీన్ని అడ్డుకునేందుకు మరో ఎమ్మెల్యే పోలీస్ కేసులు పెట్టాలని అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇదే అదనుగా మరో ఎమ్మెల్యే ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

లింగయ్య వర్సెస్ కిశోర్

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మధ్య తలెత్తిన ఇసుక పంచాయితీ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కిశోర్ ప్రాతినిధ్యం వహించే శాలిగౌరారం మండలం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ మండలంలోని వంగమర్తి, ఇటుకలపహాడ్ గ్రామాల పరిధిలో ఇటు మూసీ వాగు నుంచి, అటు అడ్డగూడూరు, మోత్కూరు మండలాల పరిధిలోని బిక్కేరు వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. యాదాద్రి జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్, మిర్యాలగూడలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవసరాలకు అని చెప్పి పర్మిట్లు తీసుకొని దొడ్డిదారిలో హైదరాబాద్​తోపాటు, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు ఇసుక సప్లై చేస్తున్నారు. 15 టన్నుల కెపాసిటీ లారీ పర్మిట్లు పొందిన కాంట్రాక్టర్లు దొంగచాటుగా 30 టన్నుల కెపాసిటీ కలిగిన లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల నుంచి తరలించే ఇసుకలారీలు నకిరేకల్ మీదుగా మూడు మండలాలు దాటుకొని హైదరాబాద్ చేరుకుంటాయి. అధికార పార్టీ నాయకుల వ్యవహారం కావడంతో ఈ మండలాల పరిధిలోని పోలీసులు కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు. కాగా, ఇసుక రవాణాలో నకిరేకల్ లారీలకు కూడా పర్మిషన్​ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టుబట్టడంతోనే వివాదం రాజుకుంది.

ముక్కలైన మున్సిపల్ ఎన్నికల దోస్తీ

నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఆపరేషన్ ఎమ్మెల్యే చిరుమర్తి, కిశోర్ ఆ ధ్వర్యంలో జరిగింది. శాలిగౌరారం మండలానికి చెందిన ఇద్దరు బడా వ్యాపారులకు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవడంలో కిశోర్ సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో ఆయన అనుచరుడిని నకిరేకల్ మున్సిపల్ వైస్ చైర్మన్​ చేశారు. మరో కౌన్సిలర్ క్యాండేట్ ఓడిపోయారు. ఎన్నికలు అయ్యాక ఇద్దరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటన కూడా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య దోస్తీ చెడినట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరగిందని, ఇప్పుడు కిశోర్, వీరేశం, భూపాల్​ రెడ్డి ఏకమై ఎమ్మెల్యే చిరుమర్తిని టార్గెట్ చేశారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

సీన్​లోకి మూడో ఎమ్మెల్యే

వంగమర్తి, ఇటుకల పహాడ్​, బిక్కేరు వాగుల నుంచి రోజుకు రెండు, మూడు వందల లారీల ఇసుక సప్లై జరుగుతోంది. నిబంధనలు అతిక్రమించి ఇసుక దోపిడీ జరుగుతోంది. సీజన్ లో ఒక్కో రీచ్ నుంచి రోజుకు ఎంతలేదన్నా రూ.కోటి వరకు ఇన్​కం వస్తుంది. ఇంత భారీ మొత్తంలో ఆదాయం వస్తుండటంతో దాంట్లో నకిరేకల్​ లారీ ఓనర్లకు సైతం వాటా ఇవ్వాలని ఎమ్మెల్యే చిరుమర్తి పట్టుబట్టారు. శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ, దాని పరిధి నల్గొండ జిల్లాలోకి వస్తుంది. దీంతో రెవిన్యూ, పోలీస్, ఇసుక పర్మిట్లు అన్నీ ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. కేవలం ఇసుక రీచ్​లు తుంగతుర్తి నియోజవర్గ పరిధిలో ఉన్నాయని, వాటి పైన ఒక్క ఎమ్మెల్యేకే పెత్తనం ఏమిటని నకిరేకల్ లారీ ఓనర్లు ఎమ్మెల్యే చిరుమర్తిని కలిసి మొరపెట్టుకున్నారు. గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే వీరేశం, కిశోర్​మధ్య ఇదే రకమైన వివాదం తలెత్తింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడంతో ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి సీరియస్​గా తీసుకున్నారు. నకిరేకల్​ లారీలను అనుమతించకపోతే ఇసుక రవాణా తన నియోజకవర్గం మీదుగా అనుమతించేది లేదని, అక్రమ రవాణాపై కేసులు పెట్టాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే చిరు మర్తికి గట్టికౌంటర్ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చిన ఎమ్మెల్యే కిశోర్, చిరుమర్తితో విభేదించే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని సీన్​లోకి దింపారు. భూపాల్ రెడ్డికి, చిరుమర్తి మధ్య విభేదాలు ఉండటంతో ఈ పంచాయితీని ఆయనకు తగిలిస్తే బాగుంటుందని స్కెచ్ వేశారు. అనుకున్నదే తడువుగా ఎమ్మెల్యే చిరుమర్తికి వ్యతిరేకంగా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఇసుక వివాదంలో అధికారులు తలదూర్చొద్దని చెప్పడంతో ప్రస్తుతం ఈ వివాదం హైకమాండ్​ వద్దకు చేరింది.