బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గో షిప్.. రెండుగా ముక్కలైన వంతెన

బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గో షిప్..   రెండుగా ముక్కలైన వంతెన

బీజింగ్: చైనాలోని ఓ నదిపై ఉన్న బ్రిడ్జిని భారీ కార్గో షిప్ ఢీకొట్టింది. దీంతో ఆ బ్రిడ్జి రెండుగా ముక్కలైపోయింది. అదేసమయంలో వంతెన మీది నుంచి ప్రయాణిస్తున్న బస్సుతో సహా మరో ఐదు వెహికల్స్ నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. సౌత్ చైనాలోని గ్వాంగ్​జౌలోని పెర్ట్ నదిపై గురువారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున కార్గో షిప్ ఫోషన్​​ నుంచి నాన్​హై జిల్లాకు ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యలో గ్వాంగ్​జౌ సిటీ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జిలోని కొంత భాగం విరిగిపోయి నీళ్లలో పడిపోయింది. ఆ సమయంలో షిప్​లో కూడా ఎలాంటి సరుకు, మనుషులు లేకపోవడంతో భారీ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. తెల్లవారుజాము కావడంతో బ్రిడ్జిమీద కూడా ట్రాఫిక్ తక్కువగా ఉందని వెల్లడించారు. ఆ సమయంలో బ్రిడ్జిపై నుంచి వచ్చిన ప్యాసింజర్ బస్సుతో పాటు మరో ఐదు బండ్లు నీళ్లలో పడిపోయాయని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు చనిపోయారని, మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.