వామ్మో.. సిద్దిపేట దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ ఏంది !

వామ్మో.. సిద్దిపేట దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర ఈ ట్రాఫిక్ జామ్ ఏంది !

దుద్దెడ: రాఖీ పండుగకు సొంతూళ్లు వెళ్లే జనంతో సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్.. దానికి తోడు రాఖీ పండగ అవడంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు పబ్లిక్ వెళ్తుండటంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కరీంనగర్ వెళ్లే హైవే కావడంతో దుద్దెడ టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిటకిటలాడాయి. రాఖీ పండుగ కావడంతో సిటీలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు పెద్ద సంఖ్యలో అక్కాచెల్లెళ్లు పుట్టింటికి బయలుదేరడంతో రద్దీ నెలకొంది.

విజయవాడ హైవేలోని ఎల్బీనగర్​ దగ్గర కూడా అర్ధరాత్రి వరకు వానలోనూ ప్రయాణికుల రద్దీ కొనసాగడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. అన్నదమ్ముళ్ల  కోసం అక్కా చెల్లెల్లు పుట్టింటికి ప్రయాణమయ్యారు. 

చదువులు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలకు కాస్త గ్యాప్​ ఇచ్చి వివిధ ప్రాంతాల నుంచి సొంతూరు బాట పట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ కళ సంతరించుకుంది. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టింటికి వెళ్లడం వీలుకాని అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ కార్గోలు, ఇతర కొరియర్ల ద్వారా అన్నదమ్ములకు రాఖీలు పంపించి, తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.

రాఖీ పండుగ రద్దీతో జేబీఎస్ కిక్కిరిసింది. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల దగ్గర జనం బారులు తీరారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఇప్పటికే 3వేల 500 పైగా బస్సులను నడుపుతోంది. టికెట్ల కోసం బుకింగ్ కౌంటర్ల వద్ద ఉదయం నుంచే క్యూలు కనిపించాయి. 

ALSO READ : రాఖీ సంబరాలు ...బస్సులు ఓవర్ లోడ్..

ఆన్‌లైన్ రిజర్వేషన్లు కూడా శుక్రవారం సాయంత్రానికే దాదాపు పూర్తి కావడం గమనార్హం. సీటు దొరకకపోవడంతో కొంతమంది ప్రయాణికులు నిల్చునే టికెట్లతోనే బయల్దేరాల్సి వచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు, బస్టాండ్ సిబ్బంది, పోలీసులు క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నగరానికి తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.