కాల్పుల్లో బీజేపీ లీడర్ భార్య మృతి

కాల్పుల్లో బీజేపీ లీడర్ భార్య మృతి
  • ఉత్తరాఖండ్​లో ఘటన.. యూపీ పోలీసులపై మర్డర్ కేసు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్​లోని గ్రామస్తులపై ఉత్తరప్రదేశ్​ పోలీసులు జరిపిన కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య చనిపోయింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. యూపీ పోలీసులపై అక్కడి ప్రభుత్వం హత్య కేసు నమోదు చేసింది. యూపీ మైనింగ్​ ముఠా సభ్యుడైన జాఫర్ పారిపోయి, ఉత్తరాఖండ్ జస్పూర్​లోని బీజేపీ లీడర్​ గుర్తాజ్​ భుల్లార్​ సింగ్​ ఇంట్లో దాక్కున్నట్టు యూపీ పోలీసులకు తెలిసింది. ఇప్పటికే జాఫర్​పై రూ.50వేల రివార్డు ఉంది. అతన్ని పట్టుకునేందుకు మోరాదాబాద్​కు చెందిన ఐదుగురు పోలీసులు మఫ్టీలో బుధవారం రాత్రి జాస్పూర్​ వెళ్లారు. రెక్కీ చేసి.. భుల్లార్​ ఇంట్లోనే జాఫర్​ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. అతన్ని అరెస్టు చేసేందుకు గుర్తాజ్​ ఇంటికి వెళ్లగా, భుల్లార్​ కుటుంబ సభ్యులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య అరగంట వరకు గొడవ జరిగింది. అప్పటికే గ్రామస్తులంతా పోలీసులను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు, స్థానికులకు మధ్య ఫైరింగ్​ జరిగింది. యూపీ పోలీసుల బుల్లెట్​ తగలడంతో గుర్తాజ్​ భార్య గుర్​ప్రీత్​ కౌర్​ స్పాట్​లోనే చనిపోయింది. దీంతో మరింత ఆగ్రహించిన గ్రామస్తులు, భుల్లార్​ కుటుంబ సభ్యులు పోలీసుల దగ్గర నుంచి వెపన్స్ లాక్కొని దాడి చేశారు. ఇద్దరు పోలీసులు పారిపోగా.. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పటికే జాఫర్​ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 

పరిస్థితి అదుపులోనే: ఉత్తరాఖండ్​ పోలీసులు

ఫైరింగ్​ విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్​ పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులు, గ్రామస్తులను హాస్పిటల్​కు తరలించారు. ఊళ్లో అదనపు బలగాలను మోహరించినట్టు ఉధమ్​సింగ్​ నగర్​ పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గుర్​ప్రీత్​ కౌర్​ చనిపోవడంతో ఐదుగురు యూపీ పోలీసులపై మర్డర్​ కేసు ఫైల్ చేసినట్టు వివరించారు. కొంతమంది గ్రామస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

దాడి వెనుక కుట్ర: గుర్తాజ్​ భుల్లార్​

యూపీ పోలీసుల కాల్పులను నిరసిస్తూ గ్రామస్తులతో పాటు భుల్లార్​ ఫ్యామిలీ మెంబర్స్​ జస్పూర్​లో ధర్నాకు దిగారు. ఈ కాల్పుల వెనుక పెద్ద కుట్ర ఉందని, సీబీఐతో కేసును విచారించాలని హర్​ప్రీత్​ కౌర్​భర్త గుర్తాజ్​ భుల్లార్​ డిమాండ్​ చేశారు. యూపీ పోలీసులే కాల్పులు జరిపారని, తాము ఎలాంటి ఆయుధాలు వాడలేదన్నారు. తామే ఆయుధాలను పోలీసులకు అప్పగించామన్నారు.