హైదరాబాద్, వెలుగు: ‘నా జీవితంలో నేనెప్పుడూ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు. నా దృష్టిలో అసలైన సెలబ్రేషన్ ఇది కాదు.. 2029లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి కాషాయ జెండా ఎగిరిన రోజే అసలైన వేడుక’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు.
జన్మదినం సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లిలోని స్టేట్ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తీసుకురానుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనీ, మోదీ రాకతో బీఆర్ఎస్, కాంగ్రెస్ దుకాణాలు బంద్ కావడం ఖాయమని చెప్పారు. ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలనీ, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలో బీజేపీ మేయర్లు కూర్చోబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాగా, పుట్టినరోజును పురస్కరించుకుని స్టేట్ఆఫీసులో పార్టీ ముఖ్య నేతల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు.
తార్నాకలోని వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, మనోహర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

