తాగొస్తున్నాడని ఉద్యోగం నుంచి తొలగింపు.. మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

తాగొస్తున్నాడని ఉద్యోగం నుంచి తొలగింపు.. మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన నారాయణ రెడ్డి(40) కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం సూరారం శివాలయ నగర్ కు వచ్చాడు. భార్య, కూతురు, కుమారుడితో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. 

రాజీవ్​గాంధీనగర్​లోని మెగా ఇంజినీరింగ్​ కంపెనీలో టెక్నీషియన్​గా పని చేస్తున్నాడు. కాగా నారాయణరెడ్డి ఇటీవల మద్యం తాగి విధులకు హాజరవుతుండటంతో యాజమాన్యం పలుసార్లు హెచ్చరించింది. అయినా పట్టించుకోకుండా తాగి వస్తుండటంతో ఉద్యోగం నుంచి తొలగించింది. 

దీంతో అతను మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం కంపెనీలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.10 లక్షల పరిహారంతోపాటు మృతుడి భార్యకు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.