బూర్గంపహాడ్, వెలుగు : మద్యం మత్తులో స్నేహితుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్ రాష్ట్రానికి చెందిన కుందన్ సింగ్ (45) లక్ష్మీపురం ప్రాంతంలో ఉంటూ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి కుందన్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మద్యం తాగారు.
ఈ క్రమంలో వీరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో ముగ్గురు వ్యక్తులు కలిసి కుందన్‌సింగ్‌పై దాడి చేశారు. అనంతరం బండరాయితో తలపై మోదడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బూర్గంపహాడ్ ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పింకొని వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పాల్వంచ సీఐ సతీశ్ తెలిపారు.
