సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం కన్నీళ్లను తెప్పిస్తున్న ఘటన. దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మృతుల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఏడుగురు చనిపోగా.. బతికి బయటపడ్డ యువకుని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తను బతికినందుకు సంతోషించాలా..? ఫ్యామిలీని కోల్పోయినందుకు ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న యువకుడిని తలుచుకుంటూ బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
సౌదీ లో 2025 నవంబర్ 17న తెల్లవారు జామున జరిగినబస్సు ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందిలో ప్రాణాలతో బయటపడ్డాడు షోయబ్ అనే యువకుడు. తీవ్రంగా గాయపడిన షోయబ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఏడుగురు చనిపోయినట్లుగా గుర్తించారు.
చనిపోయిన ఏడుగురి వివరాలు:
మహమ్మద్ అబ్దుల్ కధీర్ (షోయబ్ తండ్రి, గౌసియా బేగం (షోయబ్ తల్లి) తోపాటు బంధువులు మహమ్మద్ మౌలానా (గౌసియా తండ్రి, షోయబ్ తాత), రహీమ్ ఉనిషా, రెహమత్ బి, మహమ్మద్ మన్సూర్ చనిపోయారు. వీరితో పాటు మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన తర్వాత ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఏడుగురు సెల్ ఫోన్ కాల్స్ కు సైతం స్పందించడం లేదని తెలిపారు. ఘటన జరిగిన దగ్గర నుంచి అందుబాటులో లేరని బంధువులు తెలిపారు.
మక్కా దర్శనం కోసం2025 నవంబర్ 9న ట్రావెల్స్ నుంచి 20 మంది బయల్దేరినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లై జోన్ నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరినట్లు చెప్పారు. మక్కాలో దర్శనం తర్వాత మదీనాకి బయలుదేరారు 40 మంది ప్రయాణికులు. మొత్తం 44 మందిలో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. 40 మందిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది చనిపోయినట్లుగా భావిస్తున్నారు.
