చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి
  • బీజాపూర్​ జిల్లా గంగలూరు 
  • అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర పోరు
  • ఘటనాస్థలంలో ఆయుధాలు లభ్యం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​ జిల్లాలో మంగళవారం భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు సాగింది. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. బస్తర్ ఐజీ సుందర్​రాజ్​ కథనం ప్రకారం.. లోక్ సభ ఎన్నికల వేళ భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు కోర్చోలీ-లోంద్రా అడవుల్లో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. 

యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో భాగంగా  ఉదయం 6  గంటల సమయంలో కోర్చోలీ-లోంద్రా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్​ నిర్వహిస్తున్న డీఆర్జీ,  సీఆర్పీఎఫ్​, కోబ్రా, బస్తర్​ ఫైటర్స్, సీఏఎఫ్​ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దాడి నుంచి తేరుకున్న తర్వాత భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగగా, సుమారు 3 గంటలపాటు భీకరయుద్ధం జరిగింది.  ఊహించని రీతిలో పీఎల్​జీఏ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. 

వ్యూహాత్మకంగా భద్రతాబలగాలు అంచలంచెలుగా మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఒకచోట నలుగురు, మరోచోట ఆరుగురు.. మొత్తం10 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో 9 మంది పురుషులు, ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. మృతదేహాలతోపాటు ఏకే-47, ఇన్సాస్ ఎల్​ఎంజీ, ఆటోమెటిక్​ గన్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పారిపోయిన మావోయిస్టులలో పలువురు గాయాలతో ఉన్నారని బీజాపూర్​ జిల్లా కేంద్రానికి భద్రతా బలగాలు సమాచారం అందించడంతో వారికోసం అదనపు బలగాలను కోర్చోలీ-లోంద్రా అటవీ ప్రాంతానికి తరలించారు. మృతదేహాలను, ఆయుధాలను బీజాపూర్​ జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ ఎన్​కౌంటర్​పై గంగలూరు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్​లో ఈ ఏడాది ఇదే పెద్ద ఎన్​కౌంటర్​ అని సుందర్​రాజ్​ పీ వెల్లడించారు. 

బాలాఘాట్​లో మరో ఇద్దరు మావోయిస్టులు..

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని బాలాఘాట్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కేరాఝారీ అడవుల్లో కూంబింగ్​ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డ సమయంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో రఘు అలియాస్ షేర్​ సింగ్​, సంజతి అలియాస్​ క్రాంతి మృతిచెందారు. ఎన్​కౌంటర్​ స్పాట్​లో ఏకే​ 47, 12 బోర్​ గన్స్​ లభించా.

బదులు తీర్చుకున్న భద్రతా బలగాలు

సరిగ్గా మూడేండ్ల క్రితం 2021 ఏప్రిల్​ మూడో తేదీన మావోయిస్టులు మాటేసి బీజాపూర్​జిల్లా టేకులగూడలో 22 మంది 210 బెటాలియన్​ సీఆర్పీఎఫ్​ జవాన్లను దారుణంగా కాల్చి చంపారు. అప్పటి నుంచి భద్రతాబలగాలు మనోస్థైర్యం కోల్పోయి, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్​లో మంగళవారం భద్రతా బలగాలు జరిపిన దాడిలో 9 మంది మావోయిస్టులు మృతిచెందడంతో జవాన్లు సంబురాలు చేసుకున్నారు. 

మూడేండ్లకింద  కూంబింగ్​కు వెళ్లి వస్తున్న తమ జవాన్లను మాటు వేసి కాల్చి చంపారని వారు గుర్తు చేసుకున్నారు. దీంతోనే ముగియలేదని, దాడులు ఇంకా పెంచుతామని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. కాగా, బీజాపూర్​జిల్లాలోనే వారంరోజుల్లో వరుస దాడుల్లో 16 మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లో మృతిచెందడం గమనార్హం. ఇటీవలే బాసగూడ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.