కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తల్లి కథ: పిల్లల చదువు కోసం.. బస్సు కింద పడి చనిపోయింది

కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ తల్లి కథ: పిల్లల చదువు కోసం.. బస్సు కింద పడి చనిపోయింది

తమిళ‌నాడులోని సేలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్ల‌ల‌ చదువు కోసం ఓ తల్లి త‌న ప్రాణాలనే త్యాగం చేసింది. పిల్ల‌ల‌ చదివించడానికి ఆర్థిక స్తోమత సరిపోక.. తాను చ‌నిపోతే ప్ర‌భుత్వం నుండి సాయం అందుతుంద‌ని భావించి బ‌స్సుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకుంది.

సేలం ముల్లువాడికేట్‌కు చెందిన పాపతి(39) అనే మహిళకు పద్దెనిమిదిహేళ్ల క్రితం వివాహం కాగా, తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. కుమార్తె ఓ ప్రవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతుండగా.. కుమారుడు ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి ఆలనా పాలనా చూసుకుంటూ తల్లితో కలిసి జీవిస్తోంది. అయితే అమెకొచ్చే రూ.10,000 జీతం(నెలకు) ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు సరిపోయేది కాదు.

అందునా గత కొద్ది రోజులుగా కుమారుడి ట్యూషన్ ఫీజు(రూ.45వేలు) కట్టాలంటూ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఇప్పటికే పలుమార్లు సమయాన్ని పొడిగించగా.. వారిని మరోసారి సమయం అడగటానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఈ క్రమంలో తెలిసిన వారి దగ్గర చేయి చాపగా.. వారు లేవని మొహం మీద చెప్పారు. పైగా నువ్వు చ‌నిపోతే నీ కుటుంబానికి ప్ర‌భుత్వం నుండి ఆర్థిక సాయం అందుతుందని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.ఇది నిజమేనని నమ్మిన ఆ తల్లి బ‌స్సుకు ఎదురెళ్లి అత్మ‌హత్య చేసుకుంది.

కాకపోతే ఆ త‌ల్లి చేసిన ప్రాణత్యాగం ఫ‌లించ‌క‌పోవ‌డం బాధ‌కరం. పోలీసుల విచారణలో ప్ర‌మాద కేసు కాస్తా ఆత్మ‌హ‌త్య కేసుగా తెలియడంతో ప్ర‌భుత్వం నుండి ఎలాంటి ప‌రిహారం అందలేదు. ఈ విషాదకర ఘటనపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అభివృద్ధిలో ఎక్కడో ఉన్నామని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు.. ఇలాంటి వాటి గురుంచి కూడా అంతర్జాతీయ వేదికలపై మాట్లాడాలని సూచిస్తున్నారు.