బాలీవుడ్‌‌లో  రీఎంట్రీ..? 

బాలీవుడ్‌‌లో  రీఎంట్రీ..? 

‘గేమ్‌‌ చేంజర్‌‌‌‌’ చిత్రంతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు తెరకెక్కించే స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌‌ పై ఉండగానే మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదికూడా హిందీ సినిమాకు. బాలీవుడ్‌‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ఉండబోతోందని గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం ఓ హిందీ సినిమాకు చరణ్‌‌ సైన్‌‌ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

ఇది భన్సాలీ సినిమానేనా లేక మరొకరి డైరెక్షన్‌‌లోనా అనేది తెలియాల్సి ఉంది. 2013లో ‘జంజీర్‌‌‌‌’ అనే యాక్షన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తెలుగులో ‘తుఫాన్‌‌’ పేరుతో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ నిరాశ పరిచింది. దీంతో తిరిగి హిందీ సినిమాలపై చరణ్ ఆసక్తి చూపించలేదు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అవడం, రామ్ చరణ్‌‌ తన నటనతో మెప్పించడంతో, హిందీ ఫిల్మ్ మేకర్స్‌‌ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాకు చరణ్ సైన్ చేసినట్టు సమాచారం. మరి ఈ రీఎంట్రీ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది.