నా ఇంటి ప్రాబ్లమ్ తీర్చండి.. కోల్ కతా నుంచి సికింద్రాబాద్ వ్యక్తి ఫోన్

నా ఇంటి ప్రాబ్లమ్ తీర్చండి.. కోల్ కతా నుంచి  సికింద్రాబాద్ వ్యక్తి ఫోన్
  •     కోల్ కతా నుంచి ఫోన్ చేసి కోరిన సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తి
  •     ప్రజావాణికి 164 ఫిర్యాదులు, ఫోన్ ఇన్ కు 10 కాల్స్ స్వీకరించిన బల్దియా అధికారులు

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం164 ఫిర్యాదులు అందాయి.  హెడ్డాఫీసులో 76 , చార్మినార్ జోన్ లో 8, సికింద్రాబాద్ జోన్ లో 13, కూకట్ పల్లి జోన్ లో 29, శేరిలింగంపల్లి జోన్ లో 12, ఖైరతాబాద్ జోన్ లో1, ఎల్​బీనగర్ జోన్ లో 25 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.  హెడ్డాఫీసులో నిర్వహించిన ఫోన్ ఇన్ కు 10  కాల్స్ వచ్చాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్, యూబీడీ, ఇంజనీరింగ్  డిపార్టుమెంట్లకు ఫిర్యాదులు చేశారు.  

ఫోన్ ఇన్ లో కోల్ కతా  నుంచి  ఫోన్ చేసిన వ్యక్తి సికింద్రాబాద్ లో తన ఇంటి సమస్యను పరిష్కరించాలని బల్దియా అధికారులను కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారితో పాటు ఫిర్యాదుదారుడికి లేఖ పూర్వకంగా తెలిపారు. మిగతా 9 కాల్స్ వివిధ సమస్యలపై వచ్చాయి.  ప్రజావాణిలో అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజ, యాదగిరిరావు, సీఈ దేవానంద్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదులను  స్వీకరించారు.  

కలెక్టరేట్​లో 59  అప్లికేషన్లు

హైదరాబాద్ కలెక్టరేట్​లో జరిగిన  ప్రజావాణికి59 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.  ఇందులో ఇండ్లకు 24 , ఇతర శాఖలకు సంబంధించినవి 35 ఉన్నాయని చెప్పారు. సోమవారం కలెక్టరేట్​ లో ప్రజావాణిలో  కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులు, మండలాల తహశీల్దార్ ను ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఆర్డీవోలు సూర్యప్రకాశ్​, రవికుమార్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.