కార్మికుల కనీస వేతనాల పెంపుపై హైకోర్టులో పిల్

కార్మికుల కనీస వేతనాల పెంపుపై హైకోర్టులో పిల్

హైకోర్టులో పిల్ దాఖలు.. 
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు 
తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ రెండేళ్లుగా వాటి అమలుకు గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేయకుండా జాప్యం చేస్తోందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై సోమవారం హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. చీఫ్ సెక్రటరీతో పాటు, కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్, ప్రింటింగ్‌‌ అండ్‌‌ స్టోర్స్‌‌ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణ రీజనల్‌‌ ట్రేడ్‌‌ యూనియన్‌‌ కౌన్సిల్‌‌ జనరల్‌‌ సెక్రటరీ దగ్గుల సత్యం దాఖలు చేసిన ఈ పిల్‌‌పై తదుపరి విచారణను జూన్‌‌19కి వాయిదా వేస్తూ ఈ మేరకు డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. 149 ప్రభుత్వ, ప్రైవేట్‌‌ విభాగాల్లో 1,07,64,788 మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పని చేస్తున్నారని, వీరికి ప్రతి ఐదేళ్లకోసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌ వాదించారు. 2006 ఫిబ్రవరి 16న కనీస వేతనాలు పెంచారని, ఆ తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు పెంచాల్సి ఉందన్నారు. వీరికి కనీస వేతనాలను పెంచితే పరోక్షంగా 3 కోట్ల 20 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందన్నారు.   

2021 జూన్ లోనే జీవోలు ఇచ్చినా.. 

ప్రభుత్వం 2021 జూన్‌‌లోనే సెక్యూరిటీ సర్వీసెస్‌‌ కోసం కనీస వేతనాల పెంపుపై జీవో ఎంఎస్‌‌ 21, నిర్మాణ రంగ కార్మికుల కోసం జీవో 22, స్టోన్‌‌ క్రషర్‌‌ వర్కర్స్‌‌ కోసం జీవో 23, ప్రాజెక్టులు, డ్యామ్‌‌ల నిర్మాణ కార్మికుల కోసం జీవో 24, ప్రైవేట్‌‌ మోటార్‌‌ ట్రాన్స్‌‌పోర్టు సెక్టార్‌‌ కార్మికుల కోసం జీవో ఎంఎస్‌‌ 25ని జారీ చేసిందన్నారు. ఆ జీవోల అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్లు జారీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.