ఎల్బీనగర్, వెలుగు: స్కూల్‌కు వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు దూసుకెళ్లడంతో ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శేరిగూడ లో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని అక్లాస్పూర్కు చెందిన చేదీ సింగ్‌కు ఐదుగురు బిడ్డలు, కొడుకు ఉన్నాడు. కొంతకాలం కింద ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వచ్చి శేరిగూడలో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. చేదీ సింగ్ పెద్ద బిడ్డకు పెండ్లయి కొడుకు అభిషేక్ (8) ఉన్నాడు. చేదీ సింగ్ చిన్న కుమార్తె కాజల్ కుమారి (12), అభిషేక్ ఇద్దరూ శేరిగూడలోని గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు.
మంగళవారం ఉదయం 8:45 గంటలకు ఇద్దరు కలిసి స్కూల్‌కు వెళ్తున్నారు. సాగర్ సిమెంట్ షాప్ వద్ద ఉన్న యూటర్న్ దగ్గరకు రాగానే ఇబ్రహీంపట్నంకు చెందిన అంగ్లిస్ట్ హైస్కూల్ బస్సు ఓవర్ స్పీడ్ తో యూటర్న్ తీసుకుంటూ.. చిన్నారులపైకి దూసుకెళ్లింది. కాజల్ కుమారికి, అభిషేక్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ఇద్దరూ చనిపోయారు.
