కుందేలు ప్రాణం తీసిన క్రాకర్స్.. వీడియో చూస్తే కంటతడి పెట్టాల్సిందే..

కుందేలు ప్రాణం తీసిన క్రాకర్స్.. వీడియో చూస్తే కంటతడి పెట్టాల్సిందే..

పండుగలకు, పెళ్లిళ్లకు, శుభ కార్యాలకు చాలామంది క్రాకర్స్ కాల్చి ఆనందపడుతుంటారు, ఆ ఆనందం కేవలం కొన్ని సెకన్లు మాత్రమే. దానికోసం వేలకొద్ది డబ్బును వృధా చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల వారి ఆనందం ఎలా ఉన్నా.. నోరులేని మూగజీవాలు మాత్రం వాటి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది.

తాజాగా యూకేలో జరిగిన ఒక సంఘటన మూగజీవాల బాధకు నిదర్శనం.  డొన్నా పిలిగ్రిమ్ అనే వ్యక్తి క్రాకర్స్ వల్ల తన పెంపుడు కుందేలు చనిపోయే ముందు అనుభవించిన బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేము. క్రాకర్స్ కాల్చి తమకు తెలియకుండానే ఎన్నో మూగజీవాల ప్రాణాలకు అపాయం చేస్తున్నామని ఎంతోమంది తమ బాధను ఆ పోస్ట్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తూ డొన్నా ఇలా బాధపడ్డారు. సంవత్సరన్నర వయసున్న తన పెంపుడు కుందేలు క్రాకర్స్ శబ్దాలకు భయపడి వణుకుతూ చివరకు 12 గంటల తర్వాత కన్నుమూసిందని ఆయన తెలిపారు. క్రాకర్స్ కాల్చడం వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతున్నాయన్నారు. వాటివల్ల తన పెంపుడు కుందేలులాగే మరెన్నో మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు తమ కొన్ని క్షణాల ఆనందం కోసం మూగజీవాలను బలిచేయోద్దని ఆయన కోరారు.