25 ఏండ్లుగా కడుపులోనే చారాణ బిళ్ల.. కడుపునొప్పితో గాంధీ ఆస్పత్రిలో చేరిన యువతి !

25 ఏండ్లుగా కడుపులోనే చారాణ బిళ్ల.. కడుపునొప్పితో గాంధీ ఆస్పత్రిలో చేరిన యువతి !
  • మూడు గంటలు సర్జరీ చేసి బయటకు తీసిన డాక్టర్లు

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. మూడేండ్ల వయసులో పావలా కాయిన్‌‌‌‌ మింగిన ఓ యువతి (28).. 25 ఏండ్ల తర్వాత తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. స్కానింగ్‌‌‌‌లో పేగుల్లో రింగ్‌‌‌‌ లాంటి వస్తువు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు..సోమవారం సర్జరీ చేసి ఆమె కడుపులోంచి పావలా కాయిన్‌‌‌‌తో పాటు ఓ స్టోన్‌‌‌‌ను బయటకు తీశారు.పేషెంట్‌‌‌‌ బంధువుల  ప్రకారం..సిటీకి చెందిన ఓ అమ్మాయి మూడేండ్ల వయసులో తల్లి ఇచ్చిన పావలా కాయిన్‌‌‌‌ను ఆడుకుంటూ మింగేసింది. ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఇప్పటిదాకా ఆస్పత్రికి వెళ్లలేదు.

ఇటీవల పోలీస్‌‌‌‌ ఉద్యోగం సాధించేందుకు ఫిజికల్​ఫిట్ నెస్​ కోసం ఎక్సర్​సైజ్​ చేస్తుండగా.. కాయిన్‌‌‌‌ పేగులపై ఒత్తిడి చేయడంతో నొప్పి మొదలైంది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలో  చేర్చారు. సోమవారం యువతికి సర్జరీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ హెచ్‌‌‌‌ఓడీ ప్రొఫెసర్‌‌‌‌ పూర్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్లు రాజేశ్‌‌‌‌ కొంగర, ఇర్షాద్‌‌‌‌, అభినవ్‌‌‌‌ చారి మూడున్నర గంటల సర్జరీ చేసి, కడుపులోంచి పావలా కాయిన్‌‌‌‌తో పాటు ఓ స్టోన్‌‌‌‌ను బయటకు తీశారు. డాక్టర్‌‌‌‌ రాజేశ్‌‌‌‌ కొంగర మాట్లాడుతూ.. “కాయిన్‌‌‌‌, స్టోన్‌‌‌‌ రెండూ చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట ఇరుక్కోవడంతో పేగులు మడతపడి నొప్పి వచ్చింది. యువతి ప్రస్తుతం కోలుకుంటోంది. వారంలో డిశ్చార్జ్‌‌‌‌ చేస్తం” అని తెలిపారు.