మానవ జీవితంలో వరం, శాపం అనే పదాలను యుగయుగాలుగా వింటూనే ఉన్నాం. ప్రతి కథలోనూ ఉత్తములు వరాలను పొందినట్లు, దుర్మార్గులు శాపాలకు లోనయినట్లుగాను చదువుతున్నాం. ‘నా తప్పు నా పాలిటి శాపంగా మారింది’ అని భావించినవారు శాపవిముక్తులయినట్లుగానూ చదువుకున్నాం.మహాభారతంలో కర్ణుడు సాక్షాత్తు పరశురాముని దగ్గర విద్యను అభ్యసించాడు. దుర్యోధనునితో చేరి, చెడ్డ పనులు చేయడానికి తన విద్యను ఉపయోగించాలనుకున్నాడు. ఆ కారణంగానే కర్ణుని ఆయుధాలు అవసరానికి ఉపయోగపడలేదు. తన దుర్మార్గమే తన పాలిటి శాపంగా మారింది. క్షణాల వ్యవధిలో అందరినీ నాశనం చేయగల శక్తి, ఆయుధం ఉండి కూడా సమయానికి ఆ ఆయుధం అక్కరకు రాకుండా పోయింది. ఏ విద్య అయినా... సత్కార్యాలకు, లోక కల్యాణానికి మాత్రమే ఉపయోగపడాలని పెద్దలు నిశ్చయించారు. అందుకే పరాక్రమవంతులైనప్పటికీ, రెట్టింపు సైన్యం ఉన్నప్పటికీ.. పాండవుల చేతిలో పరాజయం పొందారు కౌరవులు.
శాపం అనే పదానికి ప్రతికూలత, దురదృష్టం, కీడు జరగాలని కోరుకోవడమనే అర్థాలు ఉన్నాయి. భారతీయ పురాణాల్లో దుర్వాస మహర్షి వంటి వారు శపించినట్లుగా మనం చదువుకున్నాం. కార్తవీర్యుడు అనే మహారాజు తన పురోహితుడైన గర్గ మహర్షి ఉపదేశంతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, శత్రువుల నుంచి ఓటమి లేకుండా వరం పొందాడు. వేయి చేతులు గల కార్తవీర్యుడు రావణాసురుడిని కూడా ఓడించాడు. అగ్నిదేవుని ఆకలి తీర్చిన సమయంలో.. మైత్రీ వరుణుడి ఆశ్రమం కాలి బూడిదయ్యింది. దానికి కోపించిన ఆ మహర్షి కుమారుడు కార్తవీర్యుని వేయి చేతులను పరశురాముడు ఖండించుగాక అని శపించాడు. ఒకరోజు కార్తవీర్యుడు తన పరివారంతో వేటకు వెళ్లి, కొంతసేపటికి ఆకలిదప్పులు పీడిస్తుంటే, సమీపంలోనే ఉన్న పరశురాముని తండ్రి అయిన జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మహర్షి వారందరికీ కడుపునిండుగా భోజనం పెట్టాడు. ఆ మహర్షి దగ్గర ఉన్న గోవు కారణంగానే అందరికీ భోజనం పెట్టాడని తెలుసుకున్న కార్తవీర్యుడు ఆ ఆవును తోలుకుపోయాడు. అది తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యుని వేయి చేతులను నరికి, తమ ఆవును వెనుకకు తీసుకువచ్చాడు. కార్తవీర్యునిలోని లోభగుణం కారణంగా మొత్తం క్షత్రియ జాతికి శాపంగా పరిణమించింది. పరాజయం లేకుండా ఉండే వరం పొందిన కార్తవీర్యుడు లోభగుణంతో శాపగ్రస్తుడయ్యాడు.
రామాయణంలో కబంధుని విషయానికి వస్తే..
అరణ్యవాస సమయంలో రామలక్ష్మణులు రావణుడు అపహరించిన సీతను వెదుకుతూ ఉండగా, కబంధుడు వారి ఇరువురినీ తన రెండు చేతులతో పట్టుకుని చంపడానికి సిద్ధపడ్డాడు. దేశకాలాలు తెలిసిన రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి రెండు బాహువులను భుజాల దగ్గరకు నరికేశారు. దానితో కబంధుడు నేల మీద పడిపోతూ, వారు రామలక్ష్మణులని గ్రహించాడు. తాను పూర్వం ఎంతో అందంగా ఉండే ఒక గంధర్వుడినని, ఒకనాడు ఒక మహర్షిని బెదిరించి, ఆయనకు కోపం కలిగించి, ఇంతటి భయంకర రూపాన్ని పొందానని పలికాడు. రాముని చేతిలోనే తనకు శాపవిమోచనం కలుగుతుందని పలికి, తనకు దహనసంస్కారం చేయమని కోరాడు. రాముడు అదేవిధంగా దహనం చేశాడు. అప్పుడు కబంధుడు తన దివ్యమైన రూపాన్ని పొందాడు. అలా శాపవిమోచనుడయ్యాడు. తాను గంధర్వుడనని, అందంగా ఉంటాననే అహంకారమే కబంధుడి పాలిటి శాపమయ్యింది.
అహల్య శాపం కూడా ఇలాంటిదే..
అహల్య చాలా అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఒకరోజు ఉదయాన్నే గౌతముడు నదీ స్నానానికి వెళ్లాడు. ఆమె మీద కోరికతో ఉన్న దేవేంద్రుడు అదను చూసి, గౌతముడి వేషంలో అహల్య దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా.. సాక్షాత్తూ ఇంద్రుడంతటి వాడు నా మీద మోహంతో వచ్చాడు అని భావించి, అతడిని ఆహ్వానించింది అహల్య. సరిగ్గా అదే సమయానికి నదికి వెళ్లిన గౌతముడు తిరిగివచ్చాడు. విషయం తెలుసుకుని, ఆమెను శపించాడు. ‘‘బహు సంవత్సరాలు.. ఆహారము లేకుండా గాలిని భక్షిస్తూ తపస్సు చేసుకో. నీ శరీరమంతా బూడిదతో కప్పబడి ఉంటుంది. నువ్వు ఎవ్వరికీ కనపడవు. అదృశ్యరూపంలో తపస్సు చేసుకో. త్రేతా యుగంలో రాముని రాక వలన శాపవిమోచనం అవుతుంది’’ అని పలికాడు. అహల్య తాను అందగత్తెననే అహంకారంతో విర్రవీగడం కారణంగా శాపగ్రస్తురాలైంది. రాముని సందర్శనంతో శాపవిమోచనం పొందింది. అహంకారాన్ని విడిచిపెట్టిన వారు శాపగ్రస్తులు కారని ఈ ఉదాహరణలన్నీ మనకు చెబుతున్నాయి.
- డా. పురాణపండ వైజయంతి
