న్యాయం కోసం పీఎస్​ఎదుట ఆందోళన

న్యాయం కోసం పీఎస్​ఎదుట ఆందోళన

మెదక్​, వెలుగు : బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పీఎస్​ముందు ఆందోళన చేసిన సంఘటన బుధవారం సాయంత్రం మెదక్​లో జరిగింది. పట్టణంలోని తారక రామానగర్ లో మంగళవారం సాయంత్రం మాస్టర్​ మైండ్​స్కూల్​బస్​కింద పడి అదే స్కూల్ కు చెందిన అనుశ్రీ (6) అనే చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌడిపల్లి మండలం ధర్మాసాగర్​ గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బుధవారం పెద్ద ఎత్తున మెదక్​ తరలివచ్చారు.

ప్రమాదానికి స్కూల్ బస్​డ్రైవర్​నిర్లక్ష్యమే కారణమని అందుకు స్కూల్ మేనేజ్ మెంట్ బాధ్యత వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పీఎస్ ఎదుట మెయిన్​రోడ్డుపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్​ స్తంభించడంతో టౌన్​, సీఐలు దిలీప్​ కుమార్, రాజశేఖర్​, ఎస్​ఐలు పోచయ్య, మహ్మద్ గౌస్​ స్కూల్​ మేనేజ్​ బాధ్యులను పిలిపించి మాట్లాడిస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

స్కూల్​వద్ద ఏబీవీపీ ధర్నా

అంతకు ముందు మాస్టర్ మైండ్ స్కూల్ ను ​సీజ్ చేయాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా  ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ అనుశ్రీ మృతికి బస్​ డ్రైవర్​, క్లీనర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇందుకు స్కూల్​మేనేజ్​మెంట్​ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అర్హతలు లేని డ్రైవర్లతో స్కూల్ బస్సులు నడిపించడం వల్ల ఇలాంటి దారుణాలు  జరుగుతున్నాయన్నారు.

ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి నిబంధనలు ఉల్లంఘించే స్కూల్​ లపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్, ప్రశాంత్, నాయకులు విజ్ఞాన్, సత్య, నీరజ్, కార్తికేయ పాల్గొన్నారు.