యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో.. గానంతో మెప్పించిన సీఐ సురేశ్ కుమార్

యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో.. గానంతో మెప్పించిన సీఐ సురేశ్ కుమార్
  • సోషల్ అవేర్‌‌నెస్ సాంగ్కు నెట్టింట ప్రశంసలు

పద్మారావునగర్, వెలుగు: పండుగలు, ఉత్సవాల్లో డీజేల మోత ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడతాయో చెప్తూ తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. డీజేల వల్ల ఎదురయ్యే నష్టాలను చెప్తూ హైదరాబాద్‌‌లోని రాంగోపాల్​పేట సీఐ సురేశ్ కుమార్ రూపొందించిన సోషల్ అవేర్‌‌నెస్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్, ఇన్​స్టాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. 

ఇరుముడి సినిమాలోని 'యాలలో యాలలో..ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో' సాంగ్ ను 'యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో'గా మార్చి రాయడమే కాకుండా స్వయంగా పాడారు. పండుగ సంబరాల్లో డీజేల మోత వల్ల కలిగే అనర్థాలు, ఆ శబ్దాలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని  లిరిక్స్ లో కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. 

కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, ఇలా ఆలోచింపజేసే పాటల ద్వారా ప్రజలకు చేరువవుతున్న పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఇన్​స్టాగ్రామ్​ లో దాదాపు 30 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.

సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని చక్కటి పాట రూపంలో అందించారు. మీరు సూపర్ సర్ అంటూ సీఐ సురేశ్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నగర సీపీ సజ్జనార్, సికింద్రాబాద్​ జోన్​ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సూచనలు, ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ పాట పాడినట్లు సీఐ సురేశ్ కుమార్​పేర్కొన్నారు.